Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సీఎం రేవంత్ డైరెక్షన్, సిట్ యాక్షన్: హరీష్ రావు

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకే ‘సిట్’ అధికారులు యాక్షన్ చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం బయట పెడితే తనకు గత రాత్రి నోటీస్ ఇచ్చారని, తాను ఇంట్లో లేకుంటే తమ మేడమ్ కు నోటీస్ ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను ఏ తప్పూ చేయలేదని, అన్ని విషయాలు చెబుతానని అన్నారు. తాను మాట్లాడిన దానిపై సమాధానం లేదని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఈ నోటీసులు కొత్త కాదన్నారు. గత సమైక్య రాష్ట్రంలోనే ఎన్నో కేసులు పెట్టారని, హామీలపై అడుగుతున్నందుకే తమకు నోటీసులు ఇస్తున్నారని హరీష్ రావు అన్నారు. ఈరోజు కృష్ణా, గోదావరి నీళ్లను ఆంధ్రాకు తీసుకెళ్తుంటే తాము అడ్డుకున్నామన్నారు.

ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్నారని, పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ కు నోటీస్ ఇచ్చారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాబట్టి తనకు నోటీసులు ఇచ్చారన్నారు. గతంలో తన మీద ఫోన్ టాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కొట్టేశారని, అయినా మళ్ళీ పిలుస్తున్నారని, ఎన్ని రోజులు ఈ డ్రామా? అని ప్రశ్నించారు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నానని, రేవంత్ రెడ్డితో కుమ్ముక్కు కాలేదని ఆయన నిరూపించుకోవాలంటే బొగ్గు టెండర్ల అంశంలో వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Popular Articles