ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శిబూ సోరెన్ (81) ఇక లేరు. కిడ్నీల సమస్యతో గత కొంత కాలంగా బాధపడుతున్న శిబూ సోరెన్ ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే సోమవారం తుదిశ్వాస విడిచారు. బీహార్ నుంచి జార్ఘండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం శిబూ సోరెన్ జేఎంఎం పార్టీని స్థాపించి అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు. ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం సమయంలోనే ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కీర్తిని ఆయన గడించారు. ప్రత్యేక ఝార్ఖండ్ ఆవిర్భవానంతరం ఆ రాష్ట్రానికి శిబూ సోరెన్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతేగాక 2004-2006 సంవత్సరాల మధ్య శిబూ సోరెన్ కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర పోరాటానికి శిబూ సోరెన్ కీలక మద్ధతునివ్వడం గమనార్హం. కాగా ఝార్ఖండ్ రాష్ట్రానికి ప్రస్తుతం సీఎంగా శిబూ సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ఉన్నారు.
సీఎం రేవంత్ సంతాపం:
శిబూ సోరెన్ మృతిపట్ల తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలో మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ శిబు సోరెన్ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులోనూ శిబు సోరెన్ తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు శిబుసోరెన్ ఎప్పుడూ మద్దతు తెలిపేవారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైతం చివరి వరకు ఆయన మద్దతుదారుగా నిలిచిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదివాసీ సమాజానికి గురూజీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా, జార్ఞండ్ ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందించారని సీఎం తెలిపారు. శిబు సోరెన్ కుమారుడు, జార్ఞండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు.
ఎంపీ వద్దిరాజు దిగ్భ్రాంతి, సంతాపం:
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా అధినేత శిబుసోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన సంపూర్ణ మద్దతునిచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆదివాసీలు, పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. లోక్‌సభకు 8 సార్లు, రాజ్యసభకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన రాజకీయ యోధుడని స్మరించారు. జార్ఞండ్ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు శిబూ సోరెన్ విశేష సేవలందించారని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడ్డారని ఎంపీ రవిచంద్ర కొనియాడారు. ఆయన కుమారుడు, జార్ఞండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు, కుటుంబ సభ్యులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత నేత శిబుసోరెన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ రవిచంద్ర భగవంతున్ని ప్రార్థించారు
