Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి

పటియాలా: సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకుని, కోట్ల రూపాయలను కోల్పోయాననే అవమానభారంతో ఓ మాజీ ఐపీఎస్ అధికారి తుపాకీతో కాల్చుకున్న విషాద ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయిన ఘటనను అత్యంత అవమానకరంగా భావించిన ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఈ ఘటనకు పాల్పడి, ప్రస్తుతం విషమ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పటియాలా ఎస్పీ వరుణ్ శర్మ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమర్ సింగ్ చాహల్ అనే ఐపీఎస్ అధికారి పంజాబ్ ఐజీపీగా పనిచేశారు. వివిధ రకాల ట్రేడ్ సంస్థల్లో భారీ రిటర్నుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలీగ్రామ్ గ్రూపుల ద్వారా అమర్ సింగ్ కు వల విసిరారు. దీన్ని నమ్మిన అమర్ సింగ్ పెట్టుబడులు పెట్టగా, అవి అధిక లాభాల్లో ఉన్నట్లు సైబర్ ఛీటర్స్ నకిలీ డ్యాష్ బోర్డుల ద్వారా ప్రదర్శించారు. దీన్ని నమ్మిన అమర్ సింగ్ మరిన్ని పెట్టుబడులు పెట్టారు.

అయితే పెట్టుబడులను విత్ డ్రా చేసుకునేందుకు ట్యాక్సుల రూపంలోనూ అమర్ సింగ్ భారీగానే చెల్లింపులు చేశారు. కానీ పెట్టుబడులు ఎంతకీ విత్ డ్రా కాకపోవడంతో మొత్తం రూ. 8.10 కోట్లు మోసపోయినట్లు మాజీ ఐపీఎస్ అధికారి అమర్ సింగ్ గ్రహించారు. అత్యున్నత స్థాయిలో పోలీసు అధికారిగా పనిచేసిన తానే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడాన్ని ఆయన అవమానకరంగా భావించారు.

దీంతో తాను మోసానికి గురైన విషయాన్ని వివరిస్తూ, ఇటువంటి సైబర్ నేరగాళ్లపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని పంజాబ్ డీజీపీని అభ్యర్థిస్తూ ఓ నోట్ కూడా రాశారు. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా అమర్ సింగ్ ఈ లేఖను రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుకు చెందిన రైఫిల్ తో మాజీ ఐపీఎస్ అధికారి తనను తాను కాల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు, అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పంజాబ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Popular Articles