నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) సి. మురళీధర్ రావును ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. తన పదవీ కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు రాష్టంలోని వేర్వేరు ప్రదేశాల్లో మొత్తం 11 ప్రాంతాల్లో మురళీధర్ రావు అక్రమాస్తులకు సంబంధించి తనిఖీలు జరిపారు.
కొండాపూర్ లో విల్లా, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, బేగంపేట, కోకాపేటల్లో ఒక్కోటి చొప్పున ఫ్లాట్లు, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లో రెండు వాణిజ్య భవనాలు, కోదాడలో ఓ అపార్ట్మెంట్, జహీరాబాద్ లో 2కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, వరంగల్ మహానగరంలో నిర్మాణంలో గల అపార్టుమెంట్, హైదరాబాద్ లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, నాలుగు నివాసయోగ్యమైన ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6,500 చదరపు గజాల స్థలం, ఒక మెర్సిడెస్ బెంజ్ సహా మూడు కార్లు, బంగారు నగలు,బ్యాంకు డిపాజిట్లను మురళీధర్ రావు కూడబెట్టిన ఆస్తులుగా ఇప్పటి వరకు తనిఖీల్లో కనుగొన్నట్లు ఏసీబీ వెల్లడించింది.

ఆయా స్థిర, చరాస్తులను మురళీధర్ రావు తన అధికార హయాంలో కూడబెట్టుకున్నారని, మురళీధర్ రావు అక్రమాస్తులపై సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈఎన్సీ మురళీధర్ రావును అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ ప్రకటించింది. మురళీ ధర్ రావు ఆస్తులకు సంబంధించి ఏసీబీ విడుదల చేసిన అధికార ప్రకటనను దిగువన చూడవచ్చు.
