నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై శ్రీధర్ ఇంటిపై, అతను విధులు నిర్వర్తించే ఆఫీసు, బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, సోదాలు చేసి భారీగా ఆస్తులను గుర్తించారు. మొత్తం 13 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో శ్రీధర్ కు చెందిన అనేక ఆస్తులను కనుగొన్నారు. ఏసీబీ అధికారులు తమ దాడుల్లో కనుగొన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెల్లాపూర్, షేక్ పేట, కరీంనగర్, అమీర్ పేట, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ లు, కమర్షియల్ భవంతులలతోపాటు 16 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక రెండు కార్లు, బంగారు నగలు, బ్యాంకుల్లో భారీగా నగదు మొత్తాలను కూడా అధికారులు గుర్తించారు.

ఈఈ శ్రీధర్ తన పదవిని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ వెల్లడించింది. దీంతో శ్రీధర్ పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. కాగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో శ్రీధర్ ఆస్తులకు సంబంధించి సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8 ఈఈగా పనిచేస్తున్న శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో 6,7,8 ప్యాకేజీ పనులను పర్యవేక్షించారు. ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షునిగానూ శ్రీధర్ వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ విడుదల చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.
