Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు: బట్టబయలైన రెస్టారెంట్ల, స్వీట్ హౌజ్ ల బాగోతం

ఖమ్మం నగరంలోని పలు రెస్టారెంట్లు, వివిధ రకముల మసాలా దినుసులు (స్పైసెస్), పచ్చళ్ల తయారీ, స్వీట్స్ తయారీ కేంద్రాలపై తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఉన్నతాధికారులు, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి, పి. స్వాతి, శ్రీషిక, సిహెచ్. లోకేష్, శరత్ లతో కూడిన బృందం ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్ లో గల పీ ఎస్ కే ఫుడ్స్ అండ్ స్పైసెస్, ఎన్టీఆర్ సర్కిల్ లో గల జీపి రెడ్డి ఘీ స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ యూనిట్, పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ లో వంట గది అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్, కోల్డ్ ఛాంబర్లలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయిన్ టైన్ చేయకపోవడం, సుమారు 2 వేల రూపాయల విలువ కలిగిన 8 లీటర్ల కాలం చెల్లిన ఫ్రూట్ క్రషెస్, సుమారు 19 వేల రూపాయల విలువ గల 40 కిలోల కాజు, షాజీరా, నూడుల్స్, ఇతర ముడి సరుకులపై లేబుల్ డిఫెక్ట్స్ కలిగి ఉండడం, అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన కూరగాయలను గుర్తించారు. హోటల్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని వాటిని ధ్వంసం చేసి ఎఫ్.ఎస్.ఎస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు.

అలాగే వైరా రోడ్ లో గల పిఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్ లో విస్తృత తనిఖీలు చేయగా, ఫుడ్ హ్యాండ్లర్స్ ఎటువంటి పరిశుభ్రత ప్రమాణాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తయారీ కేంద్రంలో తగిన లైటింగ్, వెంటిలేషన్ లేకపోవడం, ప్లాస్టిక్ డ్రమ్ములలో పచ్చళ్లను నిల్వ ఉంచడం, ముడి సరుకులు నిల్వ ఉంచడానికి సరైన స్టోరేజ్ సదుపాయాలు లేకపోవడం, ఆహార పదార్థాలు, ముడి సరుకులపై ఈగలు ఉండడం వంటి అంశాలను గుర్తించారు. లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన రెడీ టు ఈట్ సేవరిస్, మినప్పప్పు, రాక్ సాల్ట్ , బెల్లం, నూనె, నెయ్యి, మొదలగు పదార్థాలను గుర్తించి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టాస్క్ ఫోర్స్ హెడ్ వీ జ్యోతిర్మయి బృందం వాటిని సీజ్ చేసిింది. అనుమానిత శాంపిళ్లను పరీక్ష నిమిత్తం హైదరాబాదులో గల ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ హెడ్ తెలిపారు. ఎఫ్.ఎస్.ఎస్. చట్టం 2006 ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసిన ఆహార పదార్థాలు, వాటి దినుసులు

వైరా రోడ్ లో గల ఐబాకో ఐస్ క్రీమ్ యూనిట్లో సరైన పేరుతో లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీములు, చాక్లెట్లు నిల్వ ఉంచడం, తయారీ, ఎక్స్పైరీ డేట్ లను వినియోగదారులకు సరైన విధములో డిస్ ప్లే చేయకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో రిఫ్రిజిరేటర్లలో చాక్లెట్లు ఇతర పదార్థాలను నిల్వ ఉంచడం, సరైన పెస్ట్ కంట్రోల్ పద్ధతులను పాటించకపోవడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

ఎన్టీఆర్ సర్కిల్ లో గల జీపీ రెడ్డి ఘీ స్వీట్స్ లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో కేక్స్ తయారు చేయడం, కేక్స్, ఇతర స్వీట్స్ తయారీలో హానికర రసాయనాలు కలిగినటువంటి రంగులు కలపడం, ప్లాస్టిక్ బకెట్లలో క్రీమును నిల్వ ఉంచడం, ఈగలతో కూడినటువంటి కేకును నిల్వ ఉంచడం, 20 వేల రూపాయల విలువగల ఐదు కిలోల కాలం చెల్లిన చెర్రీస్, ఫ్రూట్ క్రషెస్, గుర్తించి వాటిని ప్రజారోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేశారు. లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన సుమారు 30 వేల రూపాయల విలువ గల 15 కిలోల కన్ఫెక్షనరీ పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, మిస్సలేనియస్ పదార్థాలను సీజ్ చేశారు.

ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఇటువంటి ఆహార తయారీదారులు, ఆహారం అమ్మేవారు ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఆహారాన్ని ప్రజలకు విక్రయించాలని హెచ్చరించారు. లేనిపక్షంలో చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ, అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని హెచ్చరించారు. ఆహారాన్ని తయారుచేసి, నిలువ చేసి, రవాణా చేసి ప్రజలకు అమ్మే వ్యాపారస్తులు కల్తీల పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు స్వచ్ఛమైన శుచి, శుభ్రత గల ఆహార పదార్థాలను, ఆహార వ్యాపారులు సరైన బాధ్యతతో వ్యవహరించాలని, సురక్షితమైన కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు అందించవలసిందిగా వ్యాపారస్తులను టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వంకాయలపాటి జ్యోతిర్మయి సూచించారు. ఈ నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు.

Popular Articles