ఉత్తరాఖండ్ ను మెరుపు వరదలు వణికించాయి. ఆకస్మిక వరదల్లో కనీసం 50 మంది గల్లంతైనట్లు, నలుగురు దుర్మరణం చెందినట్లు జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం మెరుపు వరదలు ధరాలీ అనే గ్రామాన్ని ఊడ్చుకువెళ్లాయి. ఆకస్మిక జలప్రళయంతో ధరాలీ గ్రామం వణికిపోయింది. జలప్రవాహం ధాటికి దాదాపు పాతిక వరకు హోటళ్లు, ఇండ్లు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతంలో గల ఖీర్ గడ్ నుంచి మెరుపు వరదలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ఎఫ్, ఐటీబీటి టీంలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. ఈ మెరుపు వరదల భీభత్సంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ధిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈమేరకు సీఎ ధామీకి ఫోన్ చేసి ఆరా తీశారు. కేంద్రం నుంచి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.