ఖమ్మం: బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి ప్రముఖ నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటల్స్ లో అతను బస చేస్తాడు. ఇండియాలోని చూడదగ్గ ప్రదేశాలను సందర్శించి విలాసవంతంగా గడుపుతాడు. దర్జాగా కారులో కూడా తిరుగుతాడు. కానీ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. అదే అతని స్పెషాలిటీ. ఇటువంటి ప్రత్యేకతలు గల ‘జల్సా’ దొంగను ఖమ్మం నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ‘ఫైవ్ స్టార్’ దొంగ నుంచి కారు సహా రూ. 66 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి శనివారం వెల్లడించిన కథనం ప్రకారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వేటపాలేనికి చెందిన మిక్కిలి వంశీకృష్ణ @ శామ్ రిచర్ట్ (42) హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ లో ఉంటుంటాడు. జీవితంలో గొప్పగా బతకాలనే లక్ష్యంతో పదిహేడేళ్ల వయస్సులోనే వేటపాలెం నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. కొంతకాలం నగరంలోని ఓ జిరాక్స్ షాపులో పనిచేశాడు. అయితే జిరాక్స్ షాపులో పనిచేయడం వల్ల వచ్చే డబ్బు వంశీకృష్ణ జల్సాలకు సరిపోయేది కాదు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో హైదరాబాద్ లోని ఎల్పీ నగర్, సరూర్ నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల, నార్సింగ్ తదితర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని పగటిపూటనేగాక, రాత్రి వేళల్లోనూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇందుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. వంశీకృష్ణను అరెస్ట్ చేసిన ఆయా ప్రాంతాల పోలీసులు అతన్ని జైలుకు కూడా పంపారు.

అయితే జైలు నుంచి బయటకు వచ్చాక తన జల్సా జీవితం కోసం వంశీకృష్ణను మరికొన్ని దొంగతనాలు చేశాడు. ఈ డబ్బుతోనే బెంగళూరు, గోవా, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో గల ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసి విలావంతంగా గడిపాడు. దేశంలో చూడదగ్గ అనేక ప్రదేశాలను చూశాడు. ఇందుకు సంబంధించిన సమాచారం హైదరాబాద్ పోలీసులకు తమ దర్యాప్తులో తెలిసిపోవడంతో తన చోరీలకు ఈసారి విజయవాడ, ఖమ్మం నగరాలను టార్గెట్ గా ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం వచ్చి నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ చోరీ ఘటనలకు సంబంధించి నగరంలోని ఖానాపురం హవేలీ, ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో 20 దొంగతనాలు చేసినట్లు వంశీకృష్ణ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
అయితే ఖమ్మం నగరంలోని ఖానాపురం పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎస్ఆర్ గార్డెన్స్ ఏరియాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వంశీకృష్ణ అనూహ్యంగా చిక్కాడు. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన వంశీకృష్ణ పోలీసుల తనిఖీలను చూసి కంగారుపడి వాహనాన్ని పక్కకు తిప్పుకుని పారిపోయేందుకు ప్రయత్నం చేయగా, పోలీసులు అప్రమత్తతతో నిలువరించారు. అనంతరం అతన్ని విచారించగా తన నేపథ్యాన్ని, నేరచరిత్రను వంశీకృష్ణ వివరించినట్లు నగర ఏసీపీ రమణమూర్తి చెప్పారు.

‘జల్సా’ దొంగ వంశీకృష్ణ నుంచి రూ. 18.50 లక్షల (ప్రస్తుత విలువ రూ. 51.00 లక్షలు) విలువైన 452 గ్రాముల బంగారు వస్తువులను, రూ. 15.00 లక్షల విలువైన కారు సహా మొత్తం రూ. 66.00 లక్షల విలువైన చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈకేసులో నిందితున్ని గుర్తించడంలో ప్రతిభ చూపిన ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాష్,ఎస్ఐ శ్రావణ్ కుమార్, కానిస్టేబుళ్లు వి. బాబు, వి, హరికృష్ణలను ఏసీపీ రమణమూర్తి ప్రశంసించారు.

