రాజమండ్రి: రాజమండ్రి నగరంలో కల్తీ పాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వరలక్ష్మీ డెయిరీకి చెందిన కల్తీ పాలు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలోని లాలాచెరువు, చౌడేశ్వరీ నగర్, స్వరూప్ నగర్ లో పాలు తాగి పలువురు అస్వస్థకు గురయ్యారు. ఘటనలో ఈ సాయంత్రం నాలుగున్నర గంటల సమయానికి కల్తీ పాలు తాగి చనిపోయినవారి సంఖ్య ఐదుకు చేరుకుంది. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా కల్తీ పాల ఘటన బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వరలక్ష్మీ డెయిరీకి చెందిన కల్తీ పాలు తాగడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగినట్లు ఆయన చెప్పారు. బాధ్యులపై సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశామని, చనిపోయినవారి కుటుంబాలకు రూ. 10.00 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

