ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. తాజా ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టు నక్సల్స్ మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. తాజా ఘటనలో మరణించిన ఐదుగురు మావోయిస్టుల మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. దీంతో గడచిన మూడు రోజుల్లో జరిగిన పలు ఎదురుకాల్పుల ఘటనల్లో మొత్తం ఏడుగురు సహచారులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఈ ఏడుగురిలో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు భాస్కర్ కూడా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం..
బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే మొన్న, నిన్న, నేడు జరిగినట్లు పేర్కొంటున్న ఎన్కౌంటర్ ఘటనల్లో ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 5వ తేదీన కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, ఆరో తేదీన తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లు భాస్కర్ మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 6, 7 తేదీల మధ్య సాయంత్రం కొనసాగిన ఎదురుకాల్పుల ఘటన అనంతరం మూడు మృతదేహాలను, శనివారం జరిగిన ఇంకో ఘటనలో ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం ఏడుగురి నక్సలైట్ల మృతదేహాల్లో ఇద్దరు అగ్ర నేతలను ఇప్పటికే గుర్తించగా, మిగతా ఐదుగురిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎన్కౌంటర్ ఘటనా ప్రదేశాల నుంచి ఏకే-47 ఆయుధాలతోపాటు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాముకాటు, తేనెటీగలు కుట్టడం, డీహైడ్రేషన్ తదితర సమస్యల కారణంగా కొందరు భద్రతా బలగాలు కూడా గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భద్రతా బలగాలకు సరైన వైద్య సహాయం అందుతోందని, వారి స్థితి సాధారణంగానే ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే మొత్తం ఈ సమాచారంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం.
