కూకట్ పల్లిలో వెలుగు చూసి కల్తీ కల్లు ఇద్దరిని బలి తీసుకుంది. కూకట్ పల్లిలోని హైదర్ నగర్ లో నిన్న కల్తీ కల్లు తాగి 19 మంది విరేచనాలతో, లో బీపీతో అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. వీరిలో సీతారాం (48) అనే వ్యక్తి చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందగా, ప్రయివేట్ ఆసుపత్రిలో స్వరూప అనే మహిళ కూడా ప్రాణాలు కోల్పోయారు.
కాగా కల్తీ కల్లు ఘటనపై కేసు నమోదు చేసిన బాలానగర్ ఎక్సైజ్ అధికారులు ఐదుగురు కల్లు కాంపౌండ్ నిర్వహకులను అరెస్ట్ చేశారు. నగేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. కుమార్ గౌడ్, తీగల రమేష్, బి. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా అస్వస్థకు గురైన మిగతావారికి పంజాగుట్ట నిమ్స్ అసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
