(సమీక్ష ప్రత్యేక కథనం)
మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల ముగింపునకు కేంద్రం ఏవిధంగా ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వబోతోంది? పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పేర్కొంటున్న అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డిలు సైతం లొంగబాటలో పయనిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చర్చకు దారి తీస్తున్న అత్యంత కీలక ప్రశ్న ఇది. నిర్దేశించుకున్న గడువుకు ముందే కేంద్రం తన టార్గెట్ ను రీచ్ అవుతున్నట్లు తాజా పరిణామాలు కూడా స్పష్టం చేస్తున్న వేళ.. ఏ ముఖ్య ఘటనతో కేంద్రం ‘నక్సల్ రహిత’ దేశంగా ప్రకటన చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
వచ్చే నెలాఖరుకల్లా.. అంటే మార్చి 31వ తేదీనాటికి మావోయిస్ట్ పార్టీని తుదముట్టించి నక్సల్స్ రహిత దేశంగా ప్రకటిస్తామనేది కేంద్రం ప్రతిన. తమ లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్దేశిత గడువులోగా చేరుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం పునరుద్ఘాటిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి కూడా. వందలాది మంది నక్సల్స్ ఎన్కౌంటర్ లో మృత్యువాత పడడం, మరికొన్ని వందల మంది లొంగు‘బాట’లో పయనించిన, ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. సరెండర్ దారిలో నడిచిన ముఖ్యుల్లో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, బర్సే దేవా వంటి నాయకులు కూడా ఉండగా, ఎన్కౌంటర్ కు గురైన వారిలో నంబాల కేశవరావు, చలపతి, హిడ్మా వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.

తాజా పరిణామాల్లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రెటరీగా ప్రాచుర్యంలోకి వచ్చిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తోపాటు మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతల లొంగుబాటు కూడా రేపో, మాపో అధికారికంగా జరగవచ్చనే వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘నక్సల్ రహిత’ దేశంగా కేంద్రం ప్రకటించే కీలక ఘట్టానికి సంబంధించిన ఘటన ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్కౌంటర్లలో చనిపోయిన నక్సల్స్, లొంగుబాటలో పయనించిన వారి తాజా నాయకుల, వారి వెంట వస్తున్నట్లు పేర్కొంటున్న మావోల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు ఇక పార్టీలో మిగిలిందెవరనే ప్రశ్న కూడా సహజంగానే ఉద్భవిస్తోంది.
సింపుల్ గా చెప్పాలంటే ఇంకా అజ్ఞాతంలో గల నాయకుల్లో పార్టీ మాజీ కేంద్ర కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, జార్ఖండ్ కు చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ సాగర్, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ దిగువ స్థాయిలో నాయకుల స్థాయికన్నా, సాధారణ దళసభ్యులే స్వల్ప సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో దామోదర్ సైతం తన సాయుధ బలగంతో లొంగుబాటలో పయనిస్తున్నారనే ప్రచారం కూడా మరోవైపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన ‘డెడ్ లైన్’కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫినిషింగ్ టచ్ ఏమిటనేది విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో చర్చకు దారి తీసింది.

ఆయా వరుస పరిణామాలను పరిశీలించినపుడు పార్టీకి ఒకప్పుడు సారధ్యం వహించిన ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అరెస్ట్ లేదా లొంగుబాటు ఘటన ద్వారానే కేంద్రం నక్సల్ సమస్యకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో జరుగుతోంది. వాస్తవానికి గణపతి ఇప్పుడు పార్టీకి సారధ్యం వహించే పరిస్థితులు కూడా లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలను కూడా గణపతి ఎదుర్కుంటున్నారనే ప్రచారం కూడా వ్యాప్తిలో ఉంది. పదేళ్ల క్రితమే పార్టీ సభ్యులు గణపతిని ‘డోలీ’లో మోసుకుంటూ అవసరమైన ప్రాంతానికి తరలించిన పరిస్థితులు ఏర్పడ్డాయనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నేతగా ఎదిగిన గణపతి ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు కూడా సరైన సమాచారం పోలీసుల వద్ద కూడా ఉండి ఉండకపోవచ్చు. గణపతి వంటి కీలక నాయకుడు కేంద్ర కమిటీతో మాత్రమే కాంటాక్టులో ఉండే అవకాశం ఉంది. కేంద్ర కమిటీలోని సభ్యులకుగాని, పార్టీ జనరల్ సెక్రెటరీకి మాత్రమే గణపతితో కాంటాక్ట్ ఉండే పద్ధతి ఉంటుందంటున్నారు. ప్రస్తుత కేంద్ర కమిటీ కార్యదర్శిగా పేర్కొంటున్న దేవ్ జీ, కేంద్ర కమిటీ సభ్యుడైన మల్లా రాజిరెడ్డిలు సరెండర్ బాటలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక సెంట్రల్ కమిటీలో సభ్యునిగా మిగిలింది జార్ఖండ్ కు చెందిన సాగర్ అనే కీలక నాయకుడు మాత్రమే.
అయితే గణపతి వంటి ముఖ్యనేత తాజా నిర్బంధ పరిస్థితుల్లో కేంద్ర కమిటీతో కాంటాక్టులో ఉండే అవకాశాలపైనా భిన్నవాదన వినిపిస్తోంది. రక్షణ ప్రామాణికంగా ఎంపిక చేసిన ఓ సాధారణ సభ్యునితోనూ గణపతి కాంటాక్టులో ఉండే అవకాశాలను విప్లవ కార్యకలాపాల పరిశీలకులు తోసిపుచ్చలేకపోతున్నారు. పార్టీ ముఖ్యులతో, ముఖ్యంగా కేంద్ర కమిటీతో గణపతి దాదాపు రెండేళ్ల క్రితం వరకు మాత్రమే టచ్ లో ఉన్నారట. నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాల్, దేవ్ జీ లతో 2024లో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో మీటింగులో గణపతి పాల్గొన్నట్లు ఓ ప్రచారం ఉంది. మొత్తం ఆయా నలుగురు నాయకులతో మాత్రమే అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత గణపతి ఎక్కడ ఉన్నారనేది కూడా ప్రశ్నార్థకంగానే మారిందంటున్నారు.

మొత్తంగా తాజా పరిస్థితులను, పరిణామాలను విశ్లేషించినపుడు పార్టీకి చెందిన మాజీ జనరల్ సెక్రెటరీ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సరెండర్ లేదా అరెస్ట్ ఘటనతో మావోయిస్ట్ కార్యకలాపాలకు కేంద్రం ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో విప్లవ కార్యకలాపాలకు తావు లేదని గణపతి సరెండర్ లేదా అరెస్ట్ ఘటన సందర్భంగా ప్రకటన వెలువడినా అశ్చర్యం ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బీర్కూర్ గ్రామానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి విప్లవోద్యమ ప్రస్థానం సుదీర్ఘం.
మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలకు అతని లొంగుబాటు లేదా అరెస్ట్ ద్వారానే కేంద్ర ఫినిషింగ్ టచ్ ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిన అంశం కాగా, సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు సంగోజు రవి విశ్లేషణ ప్రకారం.. దేశ చిత్రపటంలో నిన్నటి వరకు ఉనికిలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) అనే విప్లవ పార్టీ ఇక ఉనికిలో లేనట్లే. ఉంటే గింటే మావోయిస్టు భావజాలం అక్కడక్కడ ఉనికిలో ఉంటూ ఊపిరి తీసుకునే అవకాశం ఉండవచ్చేమోగానీ, ప్రస్తుతానికి మాత్రం మావోయిస్టు పార్టీ ప్రస్థానం నిర్మాణాత్మకంగా ముగిసినట్లే!

