భద్రాచలం పట్టణంలోని ఓ లాడ్జి నిర్వాహకుల బ్లాక్ మెయిల్ నిర్వాకం బహిర్గతమైంది. తమ లాడ్జికి వచ్చిన జంటలు ఏకాంతంలో ఉండగా, అప్పటికే అమర్చిన సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్ల దందాకు పాల్పడుతున్న లాడ్జి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రేమ జంట ఇటీవల భద్రాచలం రామాలయం సమీపంలో గల ఓ లాడ్జిలో బస చేసింది. ఈ సందర్భంగా ఆ ప్రేమ జంట ఏకాంతంగా గడిపిన సందర్భంగా సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలు తీసి ఆ జంటను లాడ్జి నిర్వాహకులు బ్లాక్ మెయిల్ చేశారు. తాము తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే రూ. లక్ష ఇవ్వాలని లాడ్జి నిర్వాహకులు బెదిరించారు. దీంతో భీతిల్లిన ప్రేమ జంట రూ. 60 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ లాడ్జి నిర్వాహకులు మళ్లీ మళ్లీ డబ్బు కోసం వేధిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో బాధిత ప్రేమ జంట పోలీసుల ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లాడ్జి నిర్వాహకులపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 77 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన భద్రాచలంలో తీవ్ర కలకలం రేపింది.

