రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలనేది కొందరు నాయకులకు మాత్రమే పరిమితమైన ఫార్ములా కావచ్చు.. పాలక పక్షాన్ని బద్నాం చేసేందుకు ‘సోషల్ మీడియా’ను ఉపయోగించుకోవాలనేది బహుషా వర్తమాన రాజకీయం కావచ్చు. కానీ దీనికీ హద్దులుండాలని ఆశించడం ప్రస్తుత పరిణామాల్లో అత్యాశే కావచ్చు. కాస్త పరుష భాషలో చెప్పాలంటే సిగ్గూ, ఎగ్గూ ఏమీ లేదు. ‘బరి’ తెగించడమే అసలు రాజకీయం కావచ్చు. ఆ పార్టీ, ఈ పార్టీ అని ఏమీ లేదు. అందరూ ఆ తాను ముక్కలే కావచ్చు. కానీ జనం నవ్విపోదురనే భీతి కూడా లేకపోవడమే ఇక్కడ ఆశ్చర్యకరం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తప్పా? ఒప్పా? అనే చర్చ కాదిది. కానీ ఈ భూముల అంశాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఫేక్ ‘రాజకీయం’ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలను వరుసగా పరిశీలించండి. ఇవన్నీ గడచిన రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయం రూఢీ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం మరీ ఇంత బరితెగింపునకు పాల్పడిందా? అనే ప్రశ్నలు కూడా రేకెత్తాయి. వరదలొచ్చినా, విపత్తులు సంభవించినా రూపాయి విదిల్చని ‘యాక్టర్లు’ కూడా గుండె నిండుగా స్పందించి మరీ ఖండించారు. ఇక ఇప్పుడీ ఫొటోల సంగతేమిటో చూద్దాం.

బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పోస్ట్ చేసిన ఫొటో అట ఇది. కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ యంత్రాలకు బలైపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారట. అయితే ఈ ఫొటో నకిలీదనిసైబర్ క్రైం అధికారులు తేల్చేశారు. ఫొటోలో జింక కాళ్లు కట్టేసి ఉన్నాయని, ఎక్కడో వేటాడిన జింకగా పేర్కొంటూ, కంచ గచ్చిబౌలి భూములకు, ఈ జింక ఫొటోకు ఎటువంటి సంబంధం లేదని సైబర్ క్రైం పోలీసులు తమ విచారణలో బహిర్గతం చేశారు.

ఇక ఇది మరో ఫొటో. ఈ చిత్రం కూడా సోషల్ మీడియలో తెగ తిరిగింది. చెట్లను తొలగిస్తున్న యంత్రాల ధాటికి జింకలు, నెమళ్లు, పక్షులు ప్రాణ భీతితో పారిపోతున్నట్లు కనిపిస్తున్న ఈ ఫొటో కూడా మార్ఫింగేనట. ఈ చిత్రాన్ని 99 శాతం ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ ఫొటోగా సైబర్ క్రైం పోలీసులు కనిపెట్టారు.

ఇక మూడో ఫొటో సంగతి చిత్తగిస్తే.. ‘సేవ్ HCU బయోడైవర్సీటీ’ అంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియో నుంచి కాప్చర్ చేసిన చిత్రమిది. నిజానికి అది పాత వీడియో అని, జీవ వైవిధ్యం గురించి చెప్పడానికే తాను పోస్ట్ చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ యూజరే క్లారిటీ ఇచ్చారట. ఈ పరిణామాల్లోనే ఈ వీడియోలో కనిపిస్తున్న వన్యప్రాణిని సైతం కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి లింకు పెడుతూ రాజకీయంగా వాడుకోవడమే విచిత్రం. అయితే ఫొటోలో కనిపిస్తున్న వన్యప్రాణి విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి వచ్చిన జంతువుగా సైబర్ కైం అధికారులు తేల్చారు.

కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని రాజకీయంగా వాడుకునేందుకు సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా పోస్ట్ చేసి వైరల్ చేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తాజా వార్తల సారాంశం. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్వనారిపై కేసులు పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దీంతో సూత్రధారులను గుర్తించే పనిలో సైబర్ క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు.

ఈ పరిణామాల్లోనే నకిలీ వీడియోలు వైరల్ చేశారనే అభియోగాలపై బీఆర్ఎస్ ఐటీ సెల్ పై గచ్చిబౌలి పోలీసులు మొన్న ఓ కేసు నమోదు చేయడం గమనార్హం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి దిలీప్, క్రిశాంక్ లపై బీఎన్ఎస్ చట్టంలోని 353, 1 (సీ), 353(2), 192, 196 (1), 61(1)(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉద్ధేశపూర్వకంగానే వీడియోలను తయారు చేసి వైరల్ చేశారనేది కేసులోని ప్రధాన అభియోగం. వీడియోలను ఎడిట్ చేసి ప్రజల్లో అశాంతి రేపేలా, రెచ్చగొట్టేవిధంగా సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.
డిజిటల్ క్రియేటర్, మిత్రుడు డాక్టర్ మహ్మద్ రఫీ తాజాగా ఈ అంశంపై ఏమంటారంటే..
‘‘మొత్తానికి ఆయా రాజకీయ పార్టీల సోషల్ మీడియా టీమ్ లు పులులు అనిపించుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేయాలో చేసేస్తున్నాయి. జింక సెంట్రల్ యూనివర్సిటీ లోకి వస్తే కుక్కలు గాయపరచాయి.. అంత వరకు ఓకే. ఇప్పుడు ఏకంగా సింహాలు, పులులు కంచ గచ్చిబౌలి అడవిలోంచి వస్తున్నట్లు యమా పోస్టులు పెట్టి తమాషా చూస్తున్నారు. ఎక్కడ రాజేయాలో అక్కడ రగిలిస్తున్నారు.
ఒకే ఒక జింక రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఏదయినా రాజకీయ కుట్ర వుందేమో అనిపిస్తోంది. ఒక జింకను ఎక్కడ నుంచి అయినా తీసుకొచ్చి రాత్రికి రాత్రి వదిలారేమో అనే వదంతులు కూడా వస్తున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే కానీ అసలు విషయాలు బయట పడవు. బుల్ డోజర్లకు నెమళ్ళు భయపడుతున్నట్లు తొలిరోజు వదిలిన మార్ఫింగ్ ఫోటో ఒకటీ రెండు మినహా అన్ని ప్రధాన పత్రికలు ఫేక్ అని తేల్చిన విషయం తెలిసిందే. ఇది కూడా ఎంత వరకు నిజమో నిగ్గు తేల్చాల్సిన అవసరం వుంది.’’ అంటూ ఓ సింహం ఫొటోను కూడా ఆయన తన వాల్ పై పోస్ట్ చేశారు.