Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

26 కేసులు గెలిచిన నకిలీ లాయర్..!

(సమీక్ష ప్రత్యేకం)
ఈ ఫోటోలో అడ్వొకేట్ దుస్తుల్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు Brian Mwenda (బ్రయాన్ మెవెండా). ఇతను మామూలోడు కాదు సుమీ. న్యాయవాద విద్యను అభ్యసించకున్నా లాయర్ అవతారం ఎత్తి కోర్టుల్లో 26 కేసులు గెలిచాడు! కెన్యాలో జరిగిందిది. పదిహేనేళ్లపాటు ఎవరికీ అనుమానం రాకుండా న్యాయవాదిగా చెలామణి అయ్యాడు. ఇతను 2023లో అరెస్ట్ అయ్యేనాటికి సీనియర్ అడ్వొకేట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన లాంటి పేరున్న మరో అడ్వొకేట్ పేరుతో ఇతనీ వ్యవహారాలు నడిపించాడు.

అంతేకాదు కింది కోర్టుల నుంచి నైరోబిలోని అత్యున్నత న్యాయస్థానం వరకు అనేక కేసుల్లో కక్షిదారుల తరపున హాజరై జడ్జిల మనసు గెలుచుకున్నాడు. మొత్తం 26 కేసుల్లో గెలిచి కక్షిదారులకు శిక్షపడకుండా చేశాడు. మరికొందరికి నష్టపరిహారాలు, కోల్పోయిన ఆస్తులను ఇప్పించాడు. మరో 20 కేసులకు పైగా ట్రయల్ లో ఉండగా పోలీసులకు పట్టుబటంతో అతని నల్లకోటు ప్రయణాం నిలిచిపోయింది.

బ్రయాన్ మాట్లాడే ఇంగ్లిష్ చూసి న్యాయమూర్తులు ఆయన వాదనలను ఆసక్తిగా ఆలకించేవారట. పిటిషన్లలో లీగల్ భాషను తప్పుల్లేకుండా రాసేవాడు. బెయిల్ పిటిషన్లు వేసి ఎంతో మందికి జామీన్లు ఇప్పించాడు. చివరకు అసలు లాయర్ గుర్తించడంతో బ్రయాన్ దొరికి పోయాడు. ఈ వార్త కెన్యా అంతటా సంచలనంగా మారి ఇతన్ని సమర్థించే వారు ఎక్కువయ్యారు. అరెస్టు చేయొద్దంటూ ఆందోళనలు చేశారు. లా చదవనంత మాత్రాన చట్టాలపై అతనికి ఉన్న అవగాహనతోనే కదా కేసులు గెలిచింది అని ప్రభుత్వానికి నివేదించారు.

కొసమెరుపేమిటంటే…? 2024లో తన కేసును సాధారణ పౌరుడిగా తనే వాదించుకుని గెలిచాడట. నకిలీ పేరుతో అయినా అతను వాదించి విజయం సాధించిన కేసులను తిరిగి విచారణ చేపట్టడానికి కెన్యా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అతను పేర్కొన్న సాక్ష్యాలు, ఆధారాలు సరైనవే అయినందున మళ్లీ ట్రయల్ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
source: Nigerian Tribune, Ghana Web

Popular Articles