సామర్లకోట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం చోటు చేసుకున్న భారీ పేలుడులో 21 మంది సజీవదహనమయ్యారు. మరో పదిహేను మంది వరకు గాయపడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మండలంలోని వేట్లపాలెం వద్ద కెనాల్ పక్కనే నిర్వహిస్తున్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సుమారు 2.00 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.
పేలుళ్ల తీవ్రత కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పేలుళ్ల ధాటికి దట్టమైన పొగలు వ్యాపించాయి పక్కనే గల ఓ స్కూలు భవనం స్లాబ్ కు పగుళ్లు ఏర్పడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఘటనలో క్షతగాత్రులైనవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, ఫైర్ ఇంజన్ల సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కుటుంబం నిర్వహిస్తున్న పరిశ్రమలో కెపాసిటీకి మించి బాణాసంచా తయారీ చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
కాగా వేట్లపాలెం వద్ద జరిగిన పేలుళ్ల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారగణాన్ని ఆదేశించారు. మరోవైపు హోం మంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా సీఎం చంద్రబాబు పురమాయించారు.

