సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామికవాడలో ఘోర పేలుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన కారణంగా 12 మంది దుర్మరణం చెందగా, మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్లాంట్ లోకి అడుగిడిన సమయలోనే పేలుడు సంభవించడంతో గోవన్ కారు ప్రమాద ధాటికి నుజ్జునుజ్జయింది. ఈ దుర్గటనలో భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులకు కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
