(సమీక్ష ప్రత్యేకం)
దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్.. అన్నాడట వెనకటికొకడు.. ప్రొఫెషనల్ జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ‘జన్రలిస్టు’లకు మాత్రం ఈ సామెత అతికినట్లుగా సరిపోతుందనే చెప్పాలి. ఇప్పుడీ సామెతను ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే.. నిన్న ఓ సోషల్ మీడియా పోస్టును కొందరు ‘జన్రలిస్టు’లు కాపీ పేస్ట్ చేశారే తప్ప అందులో ఉన్న సాారాంశం ఏమిటనేది కనీసం పట్టించుకున్నట్లు లేదు. కాపీ పేస్ట్ లేదా కట్ పేస్ట్ రాయుళ్లు కదా?
ఆయా సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ లో ఓ పేజీలో ఏడు లైన్ల సంక్షిప్త వార్త ఒకటి సర్క్యులేట్ అయింది. అదేమిటంటే..
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
ఎలాంటి కోతలు లేకుండా కేవలం మూడు రోజుల్లో రైతు బంధు నిధులు జమ
ఈనెల ఫిబ్రవరి 29 నుంచి 31వరకు మూడు రోజుల్లో రైతులందరికీ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం.

ఇదీ ఆ సంక్షిప్త వార్త సారాంశం. నిజానికి ఈ సోషల్ మీడియా పేజీ ప్రభుత్వ అనుకూలమో, వ్యతిరేక బీఆర్ఎస్ పార్టీ శిబిరానికి చెందిందో ఇతమిద్దంగా తెలియదుగాని, ఇదే వార్తను చాలా మంది ‘జన్రలిస్టు’లు కాపీ పేస్ట్ చేసి జనంలోకి వదిలారు. తామూ ‘జన్రలిస్టు’లమని అనిపించుకునేందుకు ఇటువంటి కట్ పేస్ట్, కాపీ పేస్ట్ రాయుళ్ల సంఖ్యకు కొదువేమీ లేదు కదా!
కానీ లీపు సంవత్సరంలో ఒక రోజు అదనపు తేదీ మినహా, ఫిబ్రవరి నెలలో 29 నుంచి 31వ వరకు తేదీలు ఉండవనే విషయం ఈ బుర్ర ఎక్కువ ‘జన్రలిస్టు’లకు తెలియదేమోగాని, రైతులకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే కొందరు ‘జన్రలిస్టు’లకు బుర్ర పని చేయదేమోగాని, రైతులు మాత్రం ఖచ్చితంగా వీళ్లకన్నా తెలివైనవారేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మబ్బులు చూసి వర్షం పడుతుందో, లేదో చెప్పగల మేథా శక్తి కర్షకులకు మాత్రమే ఉంది.
కొసమెరుపు:
ఇక ఈ పోస్టును క్రియేట్ చేసిన సోషల్ మీడియా ఖాతా గులాబీ శిబిరానికి చెందినదైతే రైతుబంధు విషయంలో ప్రభుత్వంపై సెటైర్ వేసినట్లుగా భావించాలి. అధికార పార్టీకి చెందినదైతే మాత్రం రేవంత్ సారు సర్కారు ప్రతిష్టను అధికార పార్టీ ఐటీ వింగ్ ఎక్కడితో తీసుకువెళ్లినట్లుగా అర్థం చేసుకోవాలి. ఇక పోస్టులోని సారాంశాన్ని ఏమాత్రం పరిశీలించకుండా దొరికిందే బుక్కగా కాపీ పేస్ట్ చేసిన ‘జన్రలిస్టు’లను ఏ ఖాతాలో జమ చేయాలనేదే అసలు ప్రశ్న.

