Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మేడారం సమ్మక్క కథలో పాలకులు గ్రహించాల్సిన నీతి ఇదే!

(సమీక్ష ప్రత్యేక కథనం)
ప్రభువులు ప్రజలపై దయాగుణాన్ని కలిగి ఉండాలి. పాలకులు సామాన్యుల కష్టాలను ఆలకించాలి. అందుకు అనుగుణంగా పాలనా నిర్ణయాలు తీసుకోవాలి. దయా, దాక్షిణ్యాలు లేకుండా దుర్నీతితో పాలించే ప్రభువుల పాలన ప్రజలకు అక్కర్లేదు. ఈ భావన ప్రజల్లో ఏర్పడినపుడు తమ శక్తి, సామర్థ్యాలు సరిపోతాయా? లేదా? అనే ప్రశ్నలతో పనిలేకుండా ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఎదురైన అన్యాయాలను ప్రశ్నిస్తూ ఇటువంటి పాలకులపై దండెత్తడమే సమ్మక్క-సారక్కల జాతర ప్రాశస్త్యంలోని అసలు అర్థం. మేడారం జాతర వెనుక గల వీరగాధ చెబుతున్న అసలు నీతి కూడా ఇదే. మేడారం జాతర చరిత్రను లోతుగా పరిశీలిస్తే బోధపడే అర్థం, పరమార్థం సైతం ఇదే. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

మేడారం జాతర గురించి, సమ్మక్క-సారలమ్మ కుటుంబ నేపథ్యం గురించి ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు. ఆదివాసీల మనోభావాలు దెబ్బతినకుండా ఎవరు ఏదిరాసినా పెద్దగా అభ్యంతరం చెప్పేవారు ఉండకపోవచ్చు. కానీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర చారిత్రక నేపథ్యంలో ప్రశ్నించే తత్వం మనకు కనిపిస్తుంది. ఇదేం న్యాయమని నిలదీసే ‘విప్లవ’ భావజాలం కూడా స్పష్టంగా బోధపడుతుంది. తమ వద్దగల సైనిక బలగంతో అణచివేస్తామని ప్రగల్బాలు పలికే పాలకునిపై యుద్ధం ప్రకటించక తప్పని అనివార్యతను ప్రజలకు నేర్పిస్తుంది. బలవంతుడైన రాజుతో పోరాడడం ద్వారా గెలిచామా? ఓడామా? అనేది ప్రశ్నే కాదిక్కడ.

తన జాతికోసం రక్షణ కోసం, తన ప్రజల ఆత్మగౌరవం కోసం, తనను నమ్మిన జనం బాగోగుల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన సమ్మక్క కుటుంబపు త్యాగమే నేటి మేడారం మహాజాతరకు నిలువెత్తు నిదర్శనం. సమ్మక్క కుటుంబీకులు నేడు కోట్ల మంది ప్రజలకు దేవతలు ఎలా అయ్యారో చరిత్రాత్మక కథను క్లుప్తంగానే పరిశీలిస్తే మనకు ఇదే అంశం బోధపడుతుంది.

ప్రస్తుతం జగిత్యాల జిల్లా పొలాస (ఒకప్పటి పొలవాస)ను గిరిజన దొర మేడరాజు పాలించేవారు. ఆయన ఓరోజు అడవికి వేటకు వెళ్లిన సందర్భంలో పులుల రక్షణలో పుట్టమీద కేరింతలు కొడుతూ ఓ పాప కనిపించింది. ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించిన మేడరాజు పాపను అక్కున చేర్చుకుని ఆమెకు సమ్మక్కగా నామకరణం చేశారు. సమ్మక్కను మేడరాజు పరగణనలోని ప్రజలు కూడా దైవాంశ సంభూతురాలిగానే భావించేవారు. ఎందుకంటే సమ్మక్క తన చేత్తో ఆకుపసరు ఇస్తే ప్రజలకు ఎటువంటి రోగమైనా ఇట్టే నయమయ్యేదట. వనమూలికల వైద్యంలో సమ్మక్క హస్తవాసి అలా ఉండేదట.

ఈ నేపథ్యంలోనే యుక్తవయస్సు వచ్చిన సమ్మక్కను మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. సమ్మక్క-పగిడిద్దరాజుల దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానంగా జన్మించారు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలుగా పేర్లు పెట్టారు. ఈ నేపథ్యంలోనే కాకతీయ రాజ్యంలో అనావృష్టి కరువు, కాటకాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కాకతీయ ప్రతాపరుద్రుని రాజ్యంలో మేడారం ప్రాంతానికి సామంతరాజుగా ఉన్న పగిడిద్దరాజు నిర్దేశిత ప్రకారం కప్పం చెల్లించలేకపోయారు. వర్షాలు లేక పంటలు పండలేదని, ప్రజలు కష్టాల్లో ఉన్నారని, కప్పం కట్టలేమని, ప్రభువులు దయ తలచాలని పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడిని బతిలాడాడు.

కానీ ఇందుకు ప్రతాపరుద్రుడు అంగీకరించలేదు. కప్పం కట్టకపోగా, గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోస్తూ, రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే అభియోగాలపై ప్రతాపరుద్రుడు ఆగ్రహించాడు. తన సేనాధిపతి యుగంధురున్ని మేడారం ఏరియాను పరిపాలించే పగిడిద్దరాజుపై యుద్ధానికి పురమాయించాడు. ప్రతాపరుద్రుని ఆదేశంతో యుగంధరుడు తన సైన్యంతో మేడారంపై దండెత్తుతాడు. కాకతీయుల సైన్యాన్ని చూసి పగిడిద్దరాజు భయకంపితం కాలేదు. కరువు కాటకాలతో కప్పం కట్టలేమని చేతులెత్తి మొక్కిన ప్రజలపై దండెత్తిన కాకతీయ ప్రతాపరుద్రునిపై సమరానికే ఆయన సన్నద్ధమయ్యాడు.

శక్తి ఉన్నంతవరకు తన ప్రజల రక్షణ కోసం పోరాటానికే పగిడిద్దరాజుతోపాటు ఆయన భార్య సమ్మక్క, కూతుళ్లు సారక్క, నాగులమ్మ, కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజులు యుద్దరంగంలోకి దిగారు. తమదైన రీతిలో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అయితే అత్యంత శిక్షణతో భారీ సంఖ్యలో గల కాకతీయ సేనలను తుదిశ్వాసవరకు కూడా పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, గోవిందరాజులు పోరాడుతారు. ఈ యుద్ధంలో సమ్మక్క, జంపన్నలు మినహా మిగతావారు వీరమరణం పొందుతారు. ఈ సమాచారాన్ని విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక మేడారం పక్కనే గల సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అందువల్లే సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది.

తన భర్త, ఇద్దరు కుమార్తెలు, అల్లుడి మరణంతో మరింత ఆగ్రహించిన సమ్మక్క తన వీరోచిత పోరాటం ద్వారా యుద్ధభూమిలో కాకతీయ సైన్యానికి చుక్కలు చూపెడుతుంది. సమ్మక్క శౌర్య ప్రతాపానికి ఒకానొక దశలో కాకతీయ సేనలు పరుగులంకించుకుంటాయి. ఓ ఆదివాసీ మహిళకు గల శక్తి, సామర్థ్యాలకు యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న ప్రతాపరుద్రుడు సైతం నివ్వెరపోతాడు. అయితే ఈ యుద్దంలో నేరుగా ఎదురొడ్డి సమ్మక్కతో పోరాడలేని కాకతీయ సేనలు వెనుకవైపు నుంచి ఆమెను గాయపరుస్తాయి. వెన్నుపోటు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి పక్కనే గల చిలుకల గుట్టవైపు వెడుతూ అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.

సమ్మక్కను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. చిలుకలగుట్టను జల్లెడ పట్టినప్పటికీ సమ్మక్క కనిపించలేదు. కానీ గుట్టపై గల ఓ పుట్టపై పసుపు, కుంకుమగల భరిణె కనిపించింది. ఈ భరిణను సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం జాతరను నిర్వహిస్తున్నారు. జాతర నిర్వహణకు మాఘ శుద్ధ పౌర్ణమినే తేదీలుగా ఎంచుకోవడానికి అదే తిథిన కాకతీయరాజు మేడారంపై యుద్ధాన్ని ప్రకటించడమే కారణం. అత్యంత శక్తివంతుడైన కాకతీయ ప్రతాపరుద్రున్ని సైతం తన ప్రజల కోసం ఎదిరించి యుద్ధం చేసిన సమ్మక్క కుటుంబం గిరిజనులకే కాదు, గిరిజనేతరులకూ ఆరాధ్య దైవంగా మారడం విశేషం.

మేడారం మహాజాతర ప్రాశస్త్యపు చరిత్రలో బోధపడుతున్న అసలు నీతి ఏమిటంటే.. తన జాతికోసం, తన ప్రజల క్షేమం కోసం, వారి రక్షణ కోసం పాలన చేయడమే కాదు, అవసరమైతే ప్రాణత్యాగానికీ వెరవని పాలకులు దైవాలుగా కీర్తించబడుతారని, ఆరాధ్యులుగా మారుతారని.. వందలాది ఏళ్లైనా వారి కీర్తి అజరామరంగా భాసిల్లుతుందనీ..!

Popular Articles