Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పోలీసులకు పట్టదు..! కోర్టు తీర్పులు బేఖాతర్!!

పురుషోత్తపట్నం.. నిన్న మీడియా వార్తల్లో మార్మోగిన తెలంగాణా సరిహద్దుల్లో గల ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం. భద్రాచలం పట్టణానికి మహా అయితే కిలోమీటరున్నర దూరంలో ఉంటుంది. గతంలో ఈ గ్రామం తెలంగాణాలోనే ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తొలి కేబినెట్ లోనే ఆంధ్రప్రదేశ్ లో కలిసిన అయిదు గ్రామాల్లో పురుషోత్తపట్నం కూడా ఒకటి. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల గ్రామాలు మిగతా నాలుగు. ఇందులో ఎటపాకను అక్కడి ప్రభుత్వం మండల కేంద్రంగా చేసింది.

పురుషోత్తపట్నంలోని భద్రాద్రి రాములోరి భూముల్లో నిన్న రణరంగపు ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భూముల పరిరక్షణకోసం వెళ్లిన భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దురాక్రమణదారులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో స్పృహ తప్పిన ఈవోను చికిత్సకోసం ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. పురుషోత్తపట్నంలో గల రాములోరి భూముల్లో దురాక్రమణదారుల బరితెగింపు దాడులు ఇది తొలిసారి కాదు. స్థానిక మార్కెట్ రేటు ప్రకారం ఎకరం కనీసం రూ. 30 లక్షల చొప్పున దాదాపు రూ. 266.70 కోట్ల విలువైన దేవుని భూములు కబ్జా లక్ష్యంగా ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ అక్కడి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు దేవస్థానం అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

భద్రాచలం రామాలయం దేవస్థానానికి చెందిన 889.50 ఎకరాల భూములు దశాబ్దాలుగా ఇక్కడ దురాక్రమణకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివాదాల్లో చోటు చేసుకుంటున్న దాడుల ఘటనలపై గడచిన ఐదేళ్ల కాలంలో దేవస్థానం అధికారులు అరవై సార్లకుపైగా ఫిర్యాదు చేశారు. దేవునికి చెందిన మొత్తం 889.50 ఎకరాల్లో 90 శాతానికిపైగా ఆక్రమణదారుల చెరలోనే ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దేవుని భూముల్లోని 109 ఎకరాల్లో శ్రీగోకుల రామాన్ని నిర్మించేందుకు 2018లో పనులు ప్రారంభించగా, కేవలం రెండంటే రెండు ఎకరాలకు మించిన విస్తీర్ణంలో పనులు సాగడం లేదంటే దురాక్రమణదారుల దాష్టీకాలను అవగతం చేసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితి, పరిణామాలపై తాము అసంఖ్యాకంగా ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కనీస రశీదు కూడా ఇవ్వడం లేదని దేవస్థానం అధికారవర్గాలు ఆరోపిస్తున్నాయి.

పోలీసుల సాక్షిగా పురుషోత్తపట్నంలో ఈవోపై దాడి జరిగినప్పటి చిత్రం

అక్కడి పోలీసుల వ్యవహార తీరుపై దేవస్థానం అధికారుల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, భూముల విషయంలో కోర్టు తీర్పులను సైతం ఆక్రమణదారులు ఖాతరు చేయడం లేదు. ఈ భూములకు సంబంధించి ఇప్పటికే వివిధ న్యాయస్థానాల్లో దాఖలైన 250 కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పులు వచ్చినట్లు రామాలయం అధికారులు చెబుతున్నారు. చివరికి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సైతం పురుషోత్తపట్నంలోని 889.50 ఎకరాలను దేవస్థానానికి అప్పగించాలని ఆదేశిస్తూ 2022లో తీర్పును వెలువరించారు. దేవస్థానం భూములుగా పట్టాదార్ పాస్ బుక్కులు ఉన్నప్పటికీ భూఆక్రమణదారుల దాడుల కారణంగా తాము నిస్సహాయస్థితిలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా బేఖాతర్ చేస్తున్న ఏపీ రెవెన్యూ అధికారులపై ‘కోర్టు ధిక్కార’ కేసు కూడా పెండింగులో ఉందని, రాష్ట్రీయ వానరసేన కూడా కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసినట్లు చెబుతున్నారు.

భూ దురాక్రమణదారుల దాడిలో గాయపడి అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈవో రమాదేవిని పరామర్శిస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

ఈ నేపథ్యంలోనే మంగళవారం భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై భూఅక్రమణదారులు దాడులకు తెగబడ్డారు. దాడి ఉదంతంపై తెలంగాణా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా తీవ్రస్థాయిలోనే స్పందించారు. దేవుని భూమలు కబ్జా చేస్తే పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దేవాదాయ శాఖ అధికారులపై దాడులను సహించబోమన్నారు. సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించాలని కొండా సురేఖ అభ్యర్థించారు.

కాగా భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై దాడిని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఖండించారు. ఆలయ ఈవోపై దాడి ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ, జరిగిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. ఈ భూముల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని,భూములు దేవస్థానం పరిధిలో ఉంటేనే రామాలయం అభివృద్ధి సాధ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.

Popular Articles