భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్ ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ప్రాణాలు కోల్పోయిన నక్సల్స్ లో తెలంగాణాకు చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు అలియాస్ ఊకె గణేష్, అలియాస్ రాజేష్ తివారి అలియాస్ చమ్రు గణేశన్న (65) కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన గణేష్ బీఎస్సీ చదువును అర్థంతరంగా ఆపేసి విప్లవ ఉద్యమంవైపు ఆకర్షితుడయ్యారు.. ఒడిషాలో నక్సల్ కార్యకలాపాల్లో గణేష్ చురుకైన పాత్రను పోషించినట్లు పోలీసులు ప్రకటించారు.

కందమాల్ జిల్లా చకపాడ్ ప్రాంతంలోని రంభ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం SOG, CRPF, BSF లకు చెందిన 23 బృందాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన సందర్భంగా ఈ ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు ఒడిషా పోలీసులు వెల్లడించారు. గణేష్ పై రూ. 1.1 కోట్ల నగదు రివార్డు ఉన్నట్లు చెప్పాయి. ఇదే ఘటనలో మరో ఇద్దరు నక్సల్స్ కూడా మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అంతకు ముందు కందమాల్ జిల్లాలోనే గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. గణేష్ మరణించిన ఘటనా స్థలం నుంచి రెండు INSAS రైఫిల్స్, ఒక .303 తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

