ఝార్ఖండ్ లో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం వాటిల్లింది. ఈ ఉదయం 5.30 గంటలకు పోలీసులకు, మావోయిస్టు పార్టీల మధ్య ప్రారంభమైన ఎదురుకాల్పుల ఘటనలో ఇప్పటి వరకు కనీసం ఆరుగురు నక్సలైట్లు మరణించినట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఝార్ఖండ్ లోని బొకారో జిల్లాలో సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఉదంతంలో మావోయిస్టు పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం.

బొకారో జిల్లా లల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ లో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. 209 సంఖ్యకు చెందిన కోబ్రా దళాలు నిర్వహించిన ఆపరేషన్ లో ఆరుగురు మావోయిస్టు పార్టీ నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఘటనా స్థలం నుంచి రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక ఎస్ఎల్ ఆర్, మరో పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.