ఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో కాంట్రాక్టు హత్యలకు పాల్పడే బీహార్ ముఠా (గ్యాంగ్) హతమైంది. బీహార్ సిగ్మా గ్యాంగ్ గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ముఠా నాయకుడు రంజన్ పథక్ (25)తోపాటు సభ్యులు భిమ్లేష్ మహతో (25), మనీష్ పాఠక్ (33) అమన్ ఠాకూర్ (22) హతమయ్యారు. నెలకోసారి నేరాలకు పాల్పడే ఈ హంతక ముఠాను జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీ, బీహార్ పోలీసులు ఎన్కౌంటర్ లో మట్టుబెట్టారు. సిగ్మా గ్యాంగ్ లీడర్ రంజన్ పథక్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్నాడు.
ఘటనపై బీహార్ డీజీపీ స్పందిస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయినవారంతా కిరాయి హంతకులని చెప్పారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని సీతామర్హి, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దుల్లో ఈ ముఠా నేర కార్యకలాపాలకు పాల్పడుతుందని, బీహార్‌లోని బ్రహ్మశ్రీ హత్యల్లో సిగ్మా గ్యాంగ్ పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. అక్రమ ఆయుధాల సరఫరా, దోపిడీల వంటి అనేక కేసుల్లో మోస్ట్‌వాంటెడ్‌గా ఈ ముఠా ఉందని, గ్యాంగ్ నాయకుడు రంజన్ పథక్ ను ఎన్‌కౌంటర్ చేసేందుకు బిహార్ పోలీసులు గతంలో ప్రయత్నించగా అప్పట్లో అతను తప్పించుకున్నట్లు సమాచారం.

