ఛత్తీస్ గఢ్ లో సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక అగ్ర నేతలు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని నారాయణ్ పూర్ జిల్లా అబూజ్ మడ్ రీజియన్ లో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకరపోరులో మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలంగాణాలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియస్ కోసా, సిద్ధిపేట జిల్లాకు చెందిన కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఉన్నారు.
ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిల్, బీజీఎల్ లాంఛర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, మావోయిస్ట్ పార్టీ సాహిత్యాన్ని, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణ్ పూర్ ఎస్పీ రాబిన్సన్ తెలిపారు. కాగా మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు. కఠినమైన, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, బస్తర్ పోలీసులు, భద్రతా బలగాలు నిబద్ధతతో విజయం సాధించాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, బస్తర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఉద్యమం ముగింపు దశకు చేరుకుందనే వాస్తవాన్ని మావోయిస్ట్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అంగీకరించాలని ఐజీ సుందర్ రాజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హింసను విడనాడి, జనజీవన స్రవంతిలోకి రావాలని, లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వానికి లొంగిపోవడం మినహా మరో మార్గం లేదనే విషయాన్ని నక్సలైట్లు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ఐజీ సుందర్ రాజ్ అన్నారు.

