ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో నలుగురు మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఓ మహిళ సహా నలుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒక AK-47తోపాటు .303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా వాయువ్య ప్రాంతంలోని అటవీ, కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ చెప్పారు.
నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డివిజనల్ కమిటీ సభ్యుడు దిలీప్ వెడ్జా, ఇతర నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారం ఆధారంగా DRG, కోబ్రా, STF భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య అడపా దడపా కాల్పులు జరిగాయని, సాయంత్రం వరకు ఇలా జరిగిన కాల్పుల తర్వాత ఒక మహిళా కేడర్ సహా మరో ఇద్దరు మావోయిస్టు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మొత్తంగా ఇప్పటి వరకు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో నిర్వహించిన గాలింపు చర్యల సందర్భంగా జరిగిన కాల్పుల తర్వాత మొత్తం నలుగురు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్ ఎస్పీ వివరించారు. భౌగోళికంగా క్లిష్ట, నిరంతర సవాల్ తో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ, DRG, కోబ్రా, STF బలగాలు ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. మరణించిన నలుగురు నక్సల్స్ లో ఒకరిని డివిజనల్ కమిటీ సభ్యుడు దిలీప్ వెడ్జా అలియాస్ సుక్కు అలియాస్ కైలాష్ గా ప్రాథమికంగా గుర్తించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి. ప్రకటించారు.
ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన మిగతా మావోయిస్టులు కూడా నేషనల్ పార్క్ ఏరియా కమిటీతో సంబంధం కలిగినవారిగానే భావిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఐజీ పేర్కొన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్ట్ పార్టీ పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శి సున్నం చంద్రయ్య అలియాస్ పాపారావు మరణించినట్లు తొలుత జరిగిన ప్రచారం ధ్రువపడలేదు.
పాపారావు ‘టార్టెట్’గానే జరిగిన ఈ ఆపరేషన్ లో మొత్తం నలుగురు నక్సల్స్ మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మృతుల్లో పాపారావు ఉన్నట్లు పోలీసు అధికారులు కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్ లో పాపారావు తప్పించుకుని ఉండవచ్చనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం.

