తెలంగాణాకు పొరుగున గల ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య శనివారం మరోసారి భీకరపోరు జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ వెల్లడించారు.
ఇంటలిజెన్స్ విభాగపు నివేదిక ప్రకారం వెస్ట్ బస్తర్ రేంజ్ మావోయిస్టుల ఆచూకీ గురించి సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఐజీ సుందర్ రాజ్ స్థానిక మీడియా వర్గాలకు వివరించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్,సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు నక్సల్స్ గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 8 మంది నక్సలైట్లు మరణించారని, ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ సుందర్ రాజ్ వివరించారు.