Top 5 This Week

Related Posts

రూ. 3 కోట్ల విలువైన ఏనుగు దంతాల పట్టివేత, ఒకరి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో ఏనుగు దంతాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలోని ఓ సభ్యుడిని రాచకొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వ్యక్తి నుంచి రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3.00 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఏనుగు దంతాల రవాణా, విక్రయ నేరమని చెప్పారు. నిందితులు ఏనుగు నుంచి వీటిని కట్ చేసి విక్రయానికి తీసుకువచ్చారని చెప్పారు.

ఏనుగు దంతాలను విక్రయ దందాను ప్రసాద్, లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు కొనసాగిస్తున్నారని, ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నామని, లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడని సుధీర్ బాబు చెప్పారు. శేషాచలం అడవుల నుంచి నిందితులు ఏనుగు దంతాలను తీసుకువచ్చారని, బస్సులో రవాణా చేస్తూ హైదరాబాద్ లో విక్రయానికి ప్రయత్నించారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల బరువు 5.62 కిలోలు ఉందని, కిలో ఏనుగు దంతాలను రూ. 50 నుంచి 60 లక్షలకు విక్రయిస్తున్నారని చెప్పారు. ప్రసాద్, లోకేశ్వర్ రెడ్డి ఇద్దరూ గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి జైలు జీవితం గడిపారని, జైలు పరిచయంతో ఏనుగు దంతాల స్మగ్లింగ్ కి పాల్పడ్డారని వివరించారు.

Popular Articles