(సమీక్ష ప్రత్యేకం)
చంద్రుని ఉపరితలంపై సౌర విద్యుత్తును తయారు చేసి భూమండలానికి ప్రసారం చేయడం అనే ఆలోచన నమ్మశక్యం అనిపించడం లేదు కదా..? మరో పదేళ్లలో పనులు మొదలు పెట్టి నిజం చేసి చూపిస్తామని జపాన్ ధీమాగా చెబ్తోంది. ప్రాజెక్టు ద్వారా భూమండలం కరెంటు అవసరాలు శాశ్వతంగా తీర్చ వచ్చనేది ప్రాజెక్టు రూపకల్పన వెనక ప్రధాన ఉద్దేశం.
ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉన్న ఈ ప్రణాళికను 2035 నుంచి వాస్తవ రూపం దాల్చేలా రంగం సిద్ధం చేస్తోంది. తీగలు లేకుండా సమీప ప్రాంతాలకు మైక్రోవేవ్ లు, లేజర్ల రూపంలో విద్యుత్తును ప్రసారం చేసే సాంకేతికలో జపాన్ ఇప్పటికే ముందడుగు వేసింది. మరో ఐదేళ్లలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా.
లూనా రింగ్ (Luna Ring) పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్టును షిమిజు (shimizu) కార్పోరేషన్ అనే ప్రైవేటు కంపెనీ అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అతి భారీ బ్రిడ్జిలు, సముద్రం అడుగున సొరంగాలు, దీవులను కలిపే అసాధ్యమైన వంతెనలను చేపట్టే షిమిజు ప్రపంచంలోని 20 పెద్ద కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి. దీని కేపిటల్ విలువ ₹1,30,683 crore. సంప్రదాయేతర ఇంధన రంగంలో షిమిజు భారీ పెట్టుబడులు పెడుతోంది.
ఏమిటీ లూనా రింగ్:
చంద్రుడి చుట్టూ భూమధ్య రేఖ (Moon’s equator) మీదుగా 400 కిమీ వెడల్పుతో 11,000 కిమీ ఈక్వేటర్ చుట్టూ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తుంది. అక్కడ నిర్మాణం పనుల్లో మనుషులు పాల్గొనడం కష్టం కాబట్టి రోబోలను వినియోగించాలని నిర్ణయించింది. 2035 లో పనులు ప్రారంభమైతే ఎప్పటికి పూర్తవుతాయో షిమిజు వెల్లడించలేదు. ఇది పూర్తయితే భూమిపైన శిలాజ ఇంధనాలు మండించి కరెంటు తయారు చేసే అవసరం ఉండదు. విద్యుత్తు వాహనాలకు నిరంతరాయంగా సరఫరా చేయొచ్చు. ప్రతిదీ కరెంటుతోనే నడిస్తే భూమి పర్యావరణం మెరుగవుతుంది.
sources: Japan Aerospace Exploration Agency (JAXA), Shimizu Corporation, The Telegraph, Photo: Shimizu corp.

✍️ బి.టి. గోవిందరెడ్డి

