ముస్లింలు అత్యంత ప్రాముఖ్యతతో జరుపుకునే రంజాన్ (ఈదుల్ ఫిత్ర్) వేడుకలు ఖమ్మం నగరంలోని చెర్వు బజార్ లో గల మదర్సా ఇమ్దాదుల్ ఉలూమ్ లో ఘనంగా జరిగాయి. మదర్సాలోని మైదానంలో ఉదయాన్నే ఈద్ నమాజ్ నిర్వహించారు. ముఫ్తీ మహ్మద్ జలాలుద్దీన్ ఖాస్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈద్ నమాజ్ కు నగర ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తొలుత ఆయన రంజాన్ విషిష్టత గురించి వివరించారు. నెల రోజుల పాటు ముస్లింలు ఎలాగైతే ఆధ్యాత్మిక వాతావరణంలో జీవించారో, అదే రీతిలో మిగతా రోజులు కూడా జీవనం సాగించాలని సూచించారు. అనంతరం ఆయన ఈద్ నమాజ్ ఆచరించి, ప్రత్యేక దువా చేశారు. నమాజ్ అనంతరం అక్కడికి హాజరైన ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. మదర్సా ప్రాంగణంలో జరిగిన నమాజ్ కు చిన్నారులు కూడా తమ పెద్దలతో కలిసి రావడంతో పండుగ సందడి కనిపించింది.