Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర? ఎవరా బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు!?

నిజమే కావచ్చు.. రేవంత్ సర్కారును కూల్చేందుకు కుట్ర జరుగుతున్నదేమో? గులాబీ పార్టీకి చెందిన మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం అబద్ధం ఎందుకు చెబుతారు? ఆయన మాటల్లో కఠోర వాస్తవం ఉందేమో.? కాంగ్రెస్ పాలనపై బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు పగ పెంచుకుని ఉండవచ్చు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని కసితీరా పథకం వేస్తున్నారు కావచ్చు.. ఇవేవీ నిజం కాకపోతే ప్రజలు ఎన్నుకున్న ఓ పార్టీ ఎమ్మెల్యే అంత బాహాటంగా బిల్డర్ల కుయుక్తుల గురించి, పారిశ్రామిక వేత్తల పన్నాగం గురించి మాత్రం ఎందుకు చెబుతారు?

తెలంగాణా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనేయాలని, ఖర్చు కూడా తామే భరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిల్డర్లు, కాంట్రాక్టర్లు చెప్పే ఉంటారు. వాళ్లెవరూ చెప్పకపోతే ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎందుకు ఈ విషయాన్ని రచ్చ రచ్చ చేస్తారు. బిల్డర్లు, ఇండస్ట్రీయలిస్టులు కలిసి ఈ విషయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరినైనా కలిసే ఉండవచ్చు.. సర్కారును కూల్చాలని గులాబీ పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు చేసే ఉండవచ్చు. ఇవేవీ జరగకపోతే కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం పబ్లిక్ గా ఈ సీక్రెట్ ను ఎందుకు చెబుతారు?

సిద్ధిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో పెను దుమారానికి కారణమయ్యాయనే చెప్పాలి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల ప్రకారం.. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ‘ఆత్మ’. అయితే తాను మాత్రమే కాదని, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ కు ‘ఆత్మ’లేనని కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సర్కారును పడగొట్టే వ్యాఖ్యలపై ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో వివరణ ఇస్తున్నారనేది వేరే విషయం.

వాస్తవమే కావచ్చు.. రియల్టర్లు కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారేమో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ‘స్తబ్ధు’గా ఉందనేది కాదనలేని విషయం. కానీ ఈ స్తబ్ధత తెలంగాణాలోనే ఉందా? పొరుగున గల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉందా? లేక దేశ వ్యాప్తంగా ఉందా? ఇంకాస్త లోతుల్లోకి వెడితే ప్రపంచ వ్యాప్తంగా రియల్ దందా మందగమనంలోనే ఉందా? ఇటువంటి అనేక ప్రశ్నలు రావడం సహజం. తెలంగాణాలో మాత్రమే రియల్ ఎస్టేట్ కుదేలై ఉంటే మాత్రం అందుకు బాధ్యత ఎవరిదనేది కూడా భిన్న చర్చే.

ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రముఖ రియల్టర్ అభిప్రాయం ప్రకారం.. తెలంగాణాలో మరో పాతికేళ్లకు సరిపడా భూముల రేట్లు పెరిగాయి.. కాదు కాదు పెంచేశారు. సామాన్యుడు కనీసం వంద గజాల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఉదాహరణకు తృతీయ శ్రేణి కేటగిరీ నగరంలోకి వచ్చే ఖమ్మం పట్టణంలోని పరిస్థితినే పేర్కొంటే.. రూ. 40 వేలకు తక్కువకు గజం భూమి ఎక్కడా లభించే స్థితి లేదు. ఖమ్మానికి పది కిలోమీటర్ల దూరంలోనూ భూముల ధరలు నింగిలో ఉన్నాయి. ఇక ద్వితీయ శ్రేణి నగరాల పరిధిలోకి వచ్చే వరంగల్, మెట్రోపాలిటన్ సిటీగా వర్ధిల్లుతున్న హైదరాబాద్ నగరంలోని పరిస్థితిని అంచనా వేసుకోవచ్చనేది ఆ రియల్టర్ విశ్లేషణ.

తెలంగాణాలో భూముల ధరలు ఇంతలా పెరగడానికి ‘భూమ్’ క్రియేట్ చేసిన కేసీఆర్ పాలనను బిల్డర్లు, రియల్టర్లు తిరిగి కోరుకోవడంలో తప్పు కూడా ఏమీ లేదు. గులాబీ పార్టీకే చెందిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాదన ప్రకారం కేసీఆర్ సారే మళ్లీ రావాలని అభిలషిస్తూ ఉండవచ్చు. ఇదే కోవలో కేసీఆర్ పాలన వల్ల లబ్ధి పొందిన పారిశ్రామిక వేత్తలూ కాంగ్రెస్ సర్కారును పడగొట్టడానికి డబ్బు మూటలు తీస్తామని చెప్పడంలోనూ దోషమేమీ లేకపోవచ్చు. అటు బిల్డర్లు, ఇటు ఇండస్ట్రీయలిస్టులు చేస్తున్న కుట్ర గురించి కొత్త ప్రభాకర్ రెడ్డి బహిర్గతం చేయడంలోనూ తప్పు లేకపోవచ్చు. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బడా పారిశ్రామికవేత్తే మరి. పారిశ్రామికవేత్తలు తమ అభిమతాన్ని తోటి పారిశ్రామికవేత్తతో పంచుకునే ఉంటారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్లో గ్రహించాల్సిన ముఖ్యాంశాలేమిటంటే.. బిల్డర్ల, ఇండస్ట్రీయలిస్టుల అడ్డగోలు దందాకు కాంగ్రెస్ సర్కారు సహకరించడం లేదని. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందల కోట్లకు ఎదిగిన రియల్ బ్రోకర్ల చేష్టలను ప్రభుత్వం నిలువరిస్తోందని.. పారిశ్రామికవేత్తల పప్పులు ఉడకడం లేదని. డబ్బులిస్తాం.. సర్కారును కూల్చాలని బిల్డర్లు, ఇండస్ట్రీయలిస్టులు ముందుకొస్తున్నారని సాక్షాత్తూ చట్టసభకు ఎన్నికైన శాసనసభ్యుడే చెబుతున్నారు. అందువల్ల ఈ అంశంలో ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి..? ఇదీ అసలు చర్చ.

సర్కారును పడగొట్టడానికి ఎక్కడో అడవుల్లో సమావేశమయ్యారనో, ఇంకెక్కడో రాజధాని వీధుల్లో కుట్ర పన్నారనే అభియోగాలపై కఠిన సెక్షన్లతో కేసులు పెట్టిన ఉదంతాలు అనేకం. రాజద్రోహం కింద ఇటువంటి కేసుల్లో నిందితులైనవారిని వారిని కటకటాల్లోకి నెట్టిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్కారును పడగొట్టడానికి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కుట్ర పన్నుతున్నారనడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలే సాక్ష్యం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డబ్బు సంచులు సమకూర్చడానికి రెడీగా ఉన్నబిల్డర్లది, ఇండస్ట్రీయలిస్టులది ఖచ్చితంగా రాజద్రోహమే.

అందువల్ల ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధమై రాజద్రోహానికి ఉద్యుక్తమవుతున్న ఆ బిల్డర్లు ఎవరు? పారిశ్రామికవేత్తలెవరు? అనే అంశాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించి తెలుసుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈ కుట్రకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరముందని ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు కోరుకోవడంలో తప్పు కూడా లేదు. ఇటువంటి కుట్రలను, కుతంత్రాలను చావు నోట్లో తలపెట్టి తెలంగాణాను తీసుకువచ్చిన గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ కూడా సహించకూడదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం మంచి పద్ధతి కాదని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే కేసీఆర్ సైతం ఈ రాజద్రోహ కుట్రపై విచారణను కోరితే తెలంగాణా ప్రజలు సంతోషిస్తారనేది నిర్వివాదాంశం.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles