(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
‘ధమాకా’ అంటే పలు అర్థాలున్నాయి. అనూహ్య విజయం లభించడం కూడా ‘ధమాకా’గానే భావించవచ్చు. మావోయిస్ట్ పార్టీకి చెందిన పీఎల్జీఏ బెటాలియన్ -1 కమాండర్ బడ్సె సుక్కా అలియాస్ దేవా సహా 20 మంది నక్సల్స్ ఆయుధాలతో లొంగిపోయిన ఘటనలో తెలంగాణా పోలీసులకు ఇటువంటి ‘ధమాకా’ లభించిందనే చెప్పాలి. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవా ఉదంతంలో శాఖాపరంగా ఇంత భారీ విజయం లభిస్తుందని కూడా బహుషా రాష్ట్ర పోలీసులు కూడా ఊహించి ఉండకపోవచ్చు.
విప్లవోద్యమ అజ్ఞాత జీవితంలో అప్పటివరకు ధరించిన తుపాకీని పార్టీవద్దే వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ నేపథ్యం ఒకప్పటిది. కానీ ‘ఆపరేషన్ కగార్’ ధాటికి ఆయుధాలు సహా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు టీములు, టీములుగా లొంగిపోవడం నక్సల్స్ ఉద్యమ చరిత్రలో తాజా దృశ్యం. ఇటువంటి లొంగుబాట్లలోనూ ‘సంచలనాత్మక’ రీతిలో తుపాకులు అప్పగించడం దేవా టీం లొంగు‘బాట’లో కనిపించిన అరుదైన సీన్ గా అభివర్ణించవచ్చు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వంటి అగ్రనేతల లొంగుబాటు సందర్భంగానూ దేవా టీం లొంగుబాటు తరహా దృశ్యం కనిపించకపోవడం గమనార్హం.
ఈ కథనంలో ప్రస్తావిస్తున్నది నిన్న వివరించిన ఇజ్రాయెల్ మేడ్ టావర్ (TAVOR), గురించో, అమెరికాలో తయారైన ‘కోల్ట్’ (COLT) వంటి అధునాతన తుపాకుల గురించి కానేకాదు. నిన్నటి దేవా టీం లొంగుబాటు ‘సీన్’ను మరోసారి ప్రత్యేకంగా గమనించండి. దేవా, కంకణాల రాజిరెడ్డిలు సహా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన నక్సల్స్ సంఖ్య ఇరవై మాత్రమే. కానీ పోలీసులకు అప్పగించిన తుపాకుల సంఖ్య ఎంతో గమనించారా? అక్షరాలా నలభై ఎనిమిది. ఇందులో రెండు LMG, ఒక్కోటి చొప్పున అమెరికా, ఇజ్రాయెల్ లో తయారైన Colt, Tavor రైఫిల్స్, ఎనిమిది AK-47, పది INSAS, ఎనిమిది SLR, నాలుగు BGL, పదకొండు సింగిల్ షాట్స్ తుపాకులు ఉన్నాయి. ఇవిగాక తుపాకీ తూటాలు, ఇతరత్రా ఆయుధ సామాగ్రి కూడా ఉంది.

లొంగిపోయిన నక్సల్స్ మొత్తం 20 మంది అయితే, 48 తుపాకులు దేవా టీం లొంగుబాటు ఘటనలో స్వాధీనం కావడం ఆసక్తికరం. నక్సల్స్ సంఖ్యకు రెట్టింపును మించి తుపాకులు పోలీసులకు స్వాధీనం కావడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. గడచిన రెండున్నర నెలల కాలంలో ముఖ్యమైన లొంగుబాటు ఘటనల్లో ఓసారి వెనక్కివెళ్లి పరిశీలిస్తే.. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు అక్టోబర్ 15వ తేదీన లొంగిపోయిన ఘటనలో నక్సల్స్ సంఖ్య 61 కాగా, అప్పగించిన తుపాకుల అంకె 56 మాత్రమే.
అదేవిధంగా అక్టోబర్ 17వ తేదీన ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగుబాటు పర్వంలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల సంఖ్య 208 కాగా, వాళ్లు అక్కడి సర్కార్ కు అప్పగించిన తుపాకులు 153 మాత్రమే. అంటే లొంగిపోయిన సంఖ్యకు సమాన స్థాయిలో కూడా ఈ రెండు ముఖ్య ఉదంతాల్లో తుపాకులు లేకపోవడం గమనార్హం. లొంగుబాటలో పయనించిన ఆయా మావోయిస్టులందరూ తుపాకులతో రాలేదనేది ఇక్కడ సుస్పష్టం. కానీ అక్టోబర్ 26వ తేదీన ఛత్తీస్ గఢ్ లోనే జరిగిన మరో లొంగుబాటు ఘటనలో 71 మంది నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవగా, అదే సంఖ్యలో తుపాకులు అప్పగించడం విశేషం.
అయితే పీఎల్జీఏ చీఫ్ బడ్సె సుక్కా అలియాస్ దేవా సహా తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన నక్సల్స్ సంఖ్య 20 మంది కాగా, రెండు విదేశీ అధునాతన తుపాకులు సహా అప్పగించిన ఆయుధాల అంకె 48 కావడం గమనార్హం. ఈ భారీ సంఖ్యలోని తుపాకులే కాదు, రూ. 20.30 లక్షల నగదును కూడా పోలీసులు ఇదే లొంగుబాటు సందర్భంగా సీజ్ చేయడం మరో విశేషం. ఈ నేపథ్యంలో దేవా టీం లొంగుబాటు సీన్ లో అప్పగించిన తుపాకులు అంకె రెట్టింపు సంఖ్యలో ఉండడానికి కారణంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

దేవా టీం లొంగుబాటు పర్వంలో తెలంగాణా పోలీసులు ఆయా మావోయిస్టులను తమ అదుపులోకి తీసుకున్న తర్వాత నిర్వహించిన కూంబింగ్ లో ఓ డంప్ లభ్యమైనట్లు కూడా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. బహుషా ఈ డంప్ ద్వారానే ‘డబుల్ ధమాకా’ తరహా విజయాన్ని తెలంగాణా పోలీసులు ఆయుధపరంగా దక్కించుకున్నారనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్ గఢ్, ఇంకోవైపు ఒడిషా రాష్ట్రాల్లో కనిపించిన నక్సల్స్ లొంగుబాట్ల ఘటనల్లో నగదును సీజ్ చేసిన దాఖలాలు లేవు. నిన్నటి దేవా టీం లొంగుబాటు సందర్భంగా మాత్రమే రూ. 20.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఘటన కూడా ప్రథమంగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా పీఎల్జీఏ చీఫ్ దేవా లొంగుబాటు ఘటన తెలంగాణా పోలీసులకు దక్కిన ప్రత్యేక విజయంగానే చెప్పవచ్చు. టావర్, కోల్ట్ వంటి విదేశీ ఆయుధాలు, అధునాతన ఎల్ఎంజీ, ఏకే-47, ఇన్సాస్ వంటి తుపాకులు కూడా స్వాధీనమయ్యాయి. దేవా వంటి మావోయిస్ట్ సాయుధ బలగాల నాయకుడి లొంగుబాటు పర్వంలో తెలంగాణా పోలీసులు దక్కించుకున్న మరో కితాబు ఏమిటో తెలుసా? సేఫ్ ప్యాసేజీలో దేవా టీంను లొంగుబాటలోకి తీసుకువచ్చి, డబుల్ ధమాకా రీతిలో సక్సెస్ ను అందుకోవడం. అందుకే కాబోలు అటు దేవాతోపాటు మరికొందరు విప్లవాభిమానులు కూడా తెలంగాణా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ కూడా ఈ అంశంలో సోషల్ మీడియా వేదికగా తెలంగాణా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

