రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. ఇందులో భాగంగా జూన్ 2న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సాయంత్రం వేడుకలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సాయంత్రం 4 గంటలకు నిర్వహించే వేడుకల్లో రాజీవ్ యువ వికాసం యూనిట్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ చేస్తారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాజీవ్ యువ వికాసం లబ్ధదారులకు వీటిని అందజేసేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోనూ ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో రాణి ఫంక్షన్ హాల్, వైరా నియోజకవర్గంలో మధిర రోడ్డులోని కమ్మవారి కళ్యాణ మండపం, మధిర నియోజకవర్గ పరిధిలో రిక్రియేషన్ క్లబ్, ఖమ్మం నియోజకవర్గంలో శ్రీభక్త రామదాసు కళాక్షేత్రం, పాలేరు నియోజకవర్గం పరిధిలో టి.సి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

ఆయా నియోజకవర్గాల్లో సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించి వేడుకల నందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే తన సందేశాన్ని అందిస్తారన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసిన స్వయం ఉపాధి యూనిట్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో సాయంత్రం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ప్రజలు, ప్రజాప్రతి నిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
