ఏదేని ఘటన జరిగినపుడు మీడియా సంస్థలన్నీ ఒకే సమయానికి వార్తనుగాని, ఫాలో అప్ స్టోరీనిగాని ప్రచురించాలనే నిబంధనేమీ జర్నలిజంలో లేదు. సంస్థ సామర్థ్యం, సంబంధిత విలేకరి వేగం ఇందుకు గీటురాయిగా నిలుస్తాయని వేరే చెప్పక్కర్లేదు. తమకంటే వేగంగా ముందు ప్రచురితమైన వార్తా కథనంలోని పాయింట్లను తీసుకుని అదే సారాంశంతో తమదైన శైలిలో తిరిగరాసిన కథనాన్ని పాఠకులకు అందించడంలో ఒక్కో సంస్థది ఒక్కో రీతి. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఎక్స్ క్లూజివ్ కథనంలోని విశేషాలను సైతం స్వీకరించి ప్రెజెంటేషన్ లో వినూత్న రచనా రీతిని ప్రదర్శించే జర్నలిస్టులూ అనేక మంది. ఇది కూడా తప్పు కాకపోవచ్చు. కానీ సంఘటనకు సంబంధించిన అంశంలోనూ ఇతరుల అక్షరాలను ఉన్నది ఉన్నట్లుగా లిఫ్ట్ చేసి ప్రచురించే జర్నలిజాన్ని ఏమనాలి? ‘దిశ’ అనే పత్రిక నిర్వహిస్తున్న వెబ్ సైట్ సరిగ్గా ఇదే పని చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన భూపాలపల్లి ఘటనలో రాజలింగమూర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు సంబంధించి ‘సమీక్ష’ న్యూస్ నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఓ విశేష వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘భూపాలపల్లిలో హత్యకు అసలు కారణం అదే..!? ‘సమీక్ష’ చేతిలో ఫిర్యాదు కాపీ’ శీర్షికన ఓ వార్తా కథనాన్ని వెలువరించింది. రాజలింగమూర్తి భార్య, మాజీ కౌన్సిలర్ సరళ ఈ ఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది? ఆమె ఎవరి పేర్లను ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు? అన్నదే వార్తా కథనంలోని కంటెంట్. పోలీసులకు సరళ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలనే తీసుకుని ‘సమీక్ష’ న్యూస్ తన పాఠకులకు నివేదించింది.
అయితే ‘సమీక్ష’ రాసిన వార్తా కథనంలోని కొన్ని పేరాలను ఉన్నది ఉన్నట్టుగా కట్ పేస్ట్ తరహాలో కాపీ చేసి ‘దిశ’ వెబ్ సైట్ ప్రచురించడమే ఆక్షేపణీయం. ఫిర్యాదు కాపీ బహిరంగంగా బయటకు వచ్చిన పరిస్థితుల్లో అందులోని అంశాలను తీసుకుని తమదైన శైలిలోనూ వార్తను, లేదా కథనాన్ని రాసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ‘దిశ’ ఆ పని చేయలేదు. ‘రాజలింగమూర్తి భార్య ఫిర్యాదులో ఏముందంటే..?’ అనే శీర్షికతో దిశ రాత్రి 8 గంటల ప్రాంతంలో వార్తను ప్రచురించింది.
హెడింగ్ తోపాటు డేట్ లైన్, లీడ్ లోని మొదటి వాక్యం మాత్రమే ‘దిశ’ కష్టపడి రాసుకోవడం గమనార్హం. ‘భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా.. అనే పదాల నుంచి దర్యాప్తు ప్రారంభించారు..’ అనే అక్షరాల వరకు ‘సమీక్ష’ న్యూస్ వెబ్ సైట్ నుంచి కట్ పేస్ట్ చేసిన తీరు డిజిటల్ మీడియాలో తాము తోపులమనే అప్పుడప్పుడు చెప్పుకునే ‘దిశ’ స్థాయికి ఓ తార్కాణమని చెప్పక తప్పదు. కష్టపడడం ఇష్టంలేక సమాజంలో కొందరు ఈజీ మనీ కోసం దొడ్డిదారులు తొక్కుతుంటారు. ఆయా ఘటనల తరహాలో, ఫిర్యాదు కాపీలోని అంశాలను తీసుకుని వార్తగా రాసుకోలేక ‘దిశ’ అనుసరించిన కట్ పేస్ట్ లేదా కాపీ పేస్ట్ మార్గం ఈజీ జర్నలిజమా? అనేది అక్షర తస్కరణకు పాల్పడిన వారే చెప్పాలి. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను దిగువన గమనించవచ్చు.. మొత్తం అంశంలో కొసమెరుపు ఏమిటంటే.. వార్తా కథనంలో ప్రస్తావించిన కేసు సెక్షన్లలో 191(2) అని పేర్కొనాల్సిన అంకెలో కంపోజింగ్ పొరపాటు కారణంగా 191(20; అని ప్రచురితమైంది. కనీసం ఇది కూడా గమనించి సవరించకుండా ప్రచురించడమే ‘దిశ’ కాపీ పేస్ట్ కష్టానికి అక్షర సాక్ష్యం.




