Top 5 This Week

Related Posts

ఖమ్మం ‘ఇంటెలిజెన్స్’ ఎవరి కనుసన్నల్లో..!?

ఖమ్మం జిల్లా ‘ఇంటెలిజెన్స్’ విభాగం ఎవరు కనుసన్నల్లో పనిచేస్తోంది? డిప్యూటీ సీఎం సహా ముగ్గురు కీలక మంత్రులు ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిణామాల్లో ఇంటెలిజెన్స్ వింగ్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉందా? లేక ప్రతిపక్ష పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తోందా? పోలీసు శాఖలోనే కాదు, వివిధ ప్రభుత్వ నిఘా వర్గాల్లో, అధికార పక్ష నేతల్లో, సమాజంలోని భిన్న వర్గాల్లో జరుగుతున్న చర్చకు సంబంధించిన ప్రశ్నలివి. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు సంబంధించి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన సందర్భాల్లో చట్టం నిర్దేశించిన ప్రకారం కాకుండా, అందుకు విరుద్దంగా వ్యవహరించినట్లు ఖమ్మం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంపై విమర్శలు వస్తున్న ఓ ఘటన నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది.

ఇంటెలిజెన్స్ వింగ్ అంటే ప్రభుత్వానికి కళ్లు, చెవుల్లాంటి కీలక విభాగం. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక అంశాల్లో, ఘటనల్లో సమగ్ర సమాచారాన్ని సేకరించి, క్రోఢీకరించి ప్రభుత్వానికి నివేదించడమే ఈ విభాగపు విధులు. అంతేకాదు ప్రభుత్వంలో భాగమైన మంత్రులు సహా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, ముఖ్య నాయకుల, విపక్ష పార్టీకి చెందిన లీడర్ల కదలికలపైనా ఇంటెలిజెన్స్ విభాగం డేగ కన్నేసి ఉంచుంది. ఇంటెలిజెన్స్ విభాగంలో స్టేట్, సెంట్రల్ విభాగాలు వేర్వేరుగా ఉంటాయి. స్టేట్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంటాయి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది.

ఇవిగాక స్పెషల్ బ్రాంచ్ వింగ్ మరొకటి ఉంటుంది. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయానికి అనుంబంధాంగానే ఈ విభాగం పనిచేస్తుంటుంది. కాస్త అటూ, ఇటూగా స్టేట్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగపు అధికారులు, సిబ్బంది విధులు ఒకే తరహాలో పనిచేస్తుంటారు. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల్లోపే జిల్లాల నుంచి వెళ్లే ఇటువంటి నివేదికల (డీఎస్ఆర్)ను క్రోఢీకరించి స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగం సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి టేబుల్ పైనే సమగ్ర నివేదికను ఉంచుతుంది. ఇటువంటి నివేదికల ఆధారంగానే ప్రభుత్వాధినేతలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటారు. అయితే ఈ విభాగాల నివేదికలు ఒకకోసారి సరైన సమాచారంతో అందించకుంటే ప్రభుత్వాధినేతలు ఇరుకునపడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఉన్నది ఉన్నట్లుగా, ఖచ్చిత నివేదికలను ఇచ్చే స్వేచ్ఛను పాలకులు ఈ విభాగాలకు ఇస్తున్నారా? ఒక వేళ పాలకులు స్వేచ్ఛను ఇచ్చినా విశ్వసనీయతతో గల నివేదికలు నిఘా వర్గాలు ఇస్తున్నాయా? అనేది వేరే అంశం.

వాస్తవానికి స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో, స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తున్న అధికారులుగాని, సిబ్బందిగాని మరెక్కడి నుంచో నియమితులు కాకపోవడం గమనార్హం. పాలకులు మారినప్పుడు శాంతి భద్రతల విభాగంలో కీలక స్థానంలో గలవారు స్పెషల్ బ్రాంచ్ లోకి, ఇంటెలిజెన్స్ వింగ్ లోకి, ఏసీబీలోకి, లేదంటే ఇతర లూప్ లైన్ విభాగాల్లోకి మారవచ్చు. ఎవరు ఎక్కడ పనిచేసినప్పటికీ ఇంటెలిజెన్స్ విభాగమనేది ప్రభుత్వానికి అత్యంత కీలక వింగ్ గానే చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగం పనితీరు ఎవరు కనుసన్నల్లో, మరెవరి నియంత్రణలో ఉందనే ప్రశ్నపైనే భిన్న వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలోని కొణిజర్ల మండలం కేంద్రంలో ఈనెల 11వ తేదీన ఓ ఘటనే ఇందుకు కారణం.

కొణిజర్లలోని గోపవరం పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులకు ఎరువులు సరఫరా చేస్తుండగా, గులాబీ పార్టీ పత్రికకు చెందిన టీవీ ఛానల్ రిపోర్టర్ కు, అక్కడే విధుల్లో గల ఇంటెలిజెన్స్ ఉద్యోగికి మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. ఈ వివాదాస్పద ఘటనలో సదరు ఛానల్ రిపోర్టర్ తనను వీడియో తీస్తున్న ఇంటెలిజెన్స్ విభాగపు ఉద్యోగి సెల్ ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టడంతో అది ధ్వంసమైందనే ప్రచారం జరిగింది. ఘటనా స్థలంలో టీ న్యూస్ రిపోర్టర్, ఇంటెలిజెన్స్ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరిగిందని కూడా గులాబీ పార్టీకి చెందిన పత్రిక ప్రచురించిన ఓ వార్తా కథనంలో ధ్రువీకరించడం గమనార్హం. అయితే ఇంటెలిజెన్స్ ఉద్యోగి రిపోర్టర్ ను వీడియో తీస్తుండగా ఈ వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో జనం రద్దీలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మొబైల్ కింద పడిందని, ఈ అంశంలో ఇద్దరూ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా, పోలీసులు ఇద్దరికీ సర్ది చెప్పారనేది బీఆర్ఎస్ పార్టీ పత్రిక కథనంలోని సారాంశం.

బీఆర్ఎస్ పత్రిక కథనం ప్రకారం పరిశీలించినా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, టీ న్యూస్ రిపోర్టర్ మధ్య వాగ్వాదం జరిగిందనేది వాస్తవం. అది ఏ స్థాయిలో జరిగిందనేది నిర్ధారణకాని అంశం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తమ విధులకు భంగం కలిగించినట్లు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ భావిస్తే రిపోర్టర్ పై కేసు పెట్టాల్సింది అతను కదా? ఇందుకు సంబంధించి కానిస్టేబుల్ ఏదేని ఫిర్యాదు రాసి పోలీసులకు ఇవ్వడానికి సిద్ధపడ్డారా? ఈ పరిణామాల్లో విపక్ష పార్టీకి చెందిన నాయకులెవరైనా ఇంటెలిజెన్స్ విభాగపు స్థానిక ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారా? ఈ పరిణామాల్లోనే కానిస్టేబుల్ రాసినట్లు వ్యాప్తిలో గల దరఖాస్తును పోలీస్ స్టేషన్ కు చేరకుండా మధ్యలోనే ఆగిపోయిందా? ఈ పరిణామాల్లోనే రైతు నుంచి ఫిర్యాదు అందగా, దాని ప్రకారం పోలీసులు విలేకరిపై కేసు నమోదు చేశారా? ఫలితంగా ఘటనకు సంబంధించి అసలు విషయం పక్కదారి పట్టిందా? ఇవీ ఈ ఘటనల్లో భిన్నవర్గాల్లో తలెత్తుతున్న అనేక ప్రశ్నలు.

మొత్తంగా కొణిజర్ల ఘటనను ఇంటెలిజెన్స్ విభాగపు అధికారులు ఎందుకు తేలిగ్గా తీసుకున్నారనే అంశంపైనే పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతుండడం విశేషం. మరోవైపు కొణిజర్ల ఘటనలో తన ఫోన్ ను పగులగొట్టారని ఇంటెలిజెన్స్ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Popular Articles