కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణా కేబినెట్ సోమవారం చర్చించింది. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుంచారు. కమిషన్ నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం లోతుగా చర్చించింది. దీనికి సంబంధించిన అంశాలను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరించారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
- ప్రాణహిత ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు.
- మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది.
- ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలున్నట్లు గుర్తించి విచారణకు ఆదేశించాం.
- అవినీతి, ఆశ్రిత పక్షపాతం వల్ల లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు కూలిపోయిందని, అధికారంలోకి రాగానే విచారణ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పాం.
- చెప్పిన ప్రకారం జస్టిస్ పీసీ ఘోష్ ను చైర్ పర్సన్ గా విచారణ కమిటీని నియమించాం.
- కేసీఆర్ ను, హరీష్ రావుును, ఈటెల రాజేందర్ ను కమిటీ విచారించింది.
- మొత్తం 665 పేజీల నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.
- ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి, ఆమోదించాం.
- ఊరు మార్చి, పేరు మార్చి, అవినీతికి, అక్రమాలకు పాల్పడి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విచారణ కమిటీ నివేదించింది.
- నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలతో చర్చిస్తాం.
- అసెంబ్లీలో, శాసనమండలిలో సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చు.
- త్వరలోనే ఉభయ సభలను ఏర్పాటు చేసి, నివేదికను ప్రవేశపెడతాం.
- అందరి అభిప్రాయాలను స్వీకరించి తదుపరి చర్యలకు ప్రభుత్వం ముందుకు వెడుతుంది.
- ఇది రాజకీయ పార్టీదో, రాష్ట్ర ప్రభుత్వ నివేదికో కాదు.
- న్యాయవ్యవస్థలో అత్యంత అనుభవంకలిగిన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక.
- ఈ నివేదికను తప్పుపట్టినవారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.
- ఊహాజనిత అంశాలకు తావు లేకుండా ఉండడానికే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నివేదికను వివరించాం.
- రాజకీయ, వ్యక్తిగత కక్షలతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు.
- అసెంబ్లీలో చర్చల అనంతర సారాంశాన్ని బట్టి నివేదికపై చర్యలు ఉంటాయి.
- కమిషన్ నివేదిక ఇచ్చాక కవిత ఎవరిని ప్రశ్నిస్తారు? ఆమె ప్రశ్నించాలనుకుంటే జస్టిస్ ఘోష్ కలకత్తాలో ఉంటారు. ఆమె అక్కడికి వెళ్లి ప్రశ్నించవచ్చు.
- నివేదికలోని సారాంశాన్ని, సిఫారసులను తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. ఇందుకోసం సరైన పద్ధతిని అవలంభిస్తాం.
