జర్నలిజంలో ఎథిక్స్ ఉండాలంటారు. దశ, దిశ లేకుండా వార్తలు రాస్తే మన వార్తకు మనమే ఖండన రాసుకునే పరిస్థితులను చవి చూడాల్సి ఉంటుందని సీనియర్ జర్నలిస్టులు పలు సందర్భాల్లో చెబుతుంటారు. ఈ దుస్థితి ఎదురైతే సమాజంలో పలుచనయ్యేది కూడా వార్త రాసినవాళ్లేనని.. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదని నిర్వచిస్తుంటారు. సాధారణంగా పత్రికల్లోగాని, టీవీల్లోగాని ఎవరైనా ప్రభుత్వ అధికారిపై, లేదా సంస్థపై ఏవేని ఆరోపణలతో కూడిన వార్తా కథనం రాయల్సి వస్తే సంబంధిత సంస్థ లేదా వ్యక్తి వివరణ తీసుకోవాలనేది జర్నలిజంలో ప్రాథమిక సూత్రం. పక్కా ఆధారాలు ఉంటే వివరణ లేకుండా వార్తను రాయడం కూడా జర్నలిజపు ప్రమాణాల్లో మరో కోణం. కానీ తాడూ, బొంగరం లేనివిధంగా, బట్ట కాల్చి మీదేసే టైపులో వార్తా కథనం రాస్తే ఆ తర్వాతి పరిణామాల్లో మన వార్తకు మనమే ఖండన రాయాల్సిన అనివార్యత ఏర్పడుతుందపడంలో సందేహం లేదని పేర్కొంటూ, అందుకు ఉదాహరణగా ‘దిశ’ అనే ఓ పత్రిక రాసిన కథనాన్ని ఖమ్మం జిల్లా పోలీసు వర్గాలు ఉటంకిస్తున్నాయి. అసలు విషయంలోకి వెడితే..

‘ఏపీ అక్రమార్కులకు ఖమ్మం పోలీసుల వత్తాసు’ శీర్షికన ‘దిశ’ పత్రిక తన వెబ్ సైట్ లో ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ యూకే కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నారని, ఆమెను యూకేలో ఉంటున్న విజయవాడకు చెందిన దంపతులు రూ. 1.60 కోట్లు తీసుకుని మోసం చేశారని, ఈ అంశంపై యూకే కన్సల్టెన్సీ నిర్వాహకురాలు ఖమ్మం పోలీస్ కమిషనర్ ను కలిసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారనేది కథనంలోని సారాంశం. అయితే ఈ ఉదంతంలో యూకే నుంచి విజయవాడకు వచ్చిన దంపతుల జంటను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకుని, బాధితులకు బాసటగా నిలవకుండా, నిందితులకే వత్తాసు పలికారనేది ఆయా వార్తా కథనపు కంటెంట్. ఈ అంశంలో స్టేషన్ ఉన్నతాధికారి నిందితులకు ఇతోధికంగా సాయం చేస్తుండడం విస్మయాన్ని కలిగించినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. నిన్న ఉదయం 11.39 గంటలకు తన వెబ్ సైట్ లో ఈ వార్తా కథనాన్ని ప్రచురించిన ‘దిశ’ పత్రిక కొద్ది గంటల వ్యవధిలోనే రాత్రి 7.00 గంటల డైనమిక్ ఎడిషన్ లో ఇందుకు భిన్నమైన మరో వార్తా కథనాన్ని ప్రచురించడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే అదే పత్రిక ఈ భిన్న కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

‘కన్సల్టెన్సీ పేరిట రూ. 1.60 కోట్లకు టోకరా’ శీర్షికన ప్రచురించిన భిన్న కథనంలో విజయవాడకు చెందిన నిందితులపై కేసు నమోదు చేశారనేది ఈ వార్తలోని ముఖ్యాంశం. ఇదే కథనంలో ‘స్క్రీన్’ ఐటెమ్ గా మరో ఆసక్తికర అంశం ఉండడం గమనార్హం. నిందితులతో పోలీసులు కుమ్ముక్కై బాధితులకు న్యాయం జరగలేదన్న విషయం అవాస్తమని, పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారని, సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార కథనాల్లో నిజం లేదని, ఆధారాలు లేకుండా ఇటువంటి కథనాలు ప్రచురించవద్దని, సంబంధిత అధికారుల వివరణ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించినట్లు ‘దిశ’ పత్రిక ఇందులో ప్రస్తావించడం గమనార్హం.

ఈ మొత్తం అంశంలో పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ పత్రిక తన వెబ్ సైట్ లో కథనం ప్రచురించిన దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే స్వయం ఖండిత సారాంశంతో మరో కథనం రావడమేంటి? అసలు ఆ కథనాన్ని అవాస్తవమని ప్రకటించిన సదరు ఉన్నతాధికారులెవరు? నిందితులతో పోలీసులు కుమ్ముక్కైనట్లు ఆరోపణలు చేసిందెవరు? ఆ తర్వాత కథనంలో నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన పోలీసు అధికారులెవరు? ప్రచురించిన నిరాధార కథనాల లింక్ లను సోషల్ మీడియాలో షేర్ చేసిందెవరు? ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురించవద్దని చెప్పిన పోలీసు ఉన్నతాధికారులెవరు? ఎటువంటి అధికారి పేరునుగాని, అధికారిక ప్రకటనను గాని ఉటంకించకుండా తొలి కథనానికి భిన్నంగా రెండో కథనం ప్రచురించడంలో తెరవెనుక జరిగిందేమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రాామాణికంగా ‘దిశ’ పత్రిక ప్రచురించిన వార్తా కథనాలపై పోలీసు వర్గాలు భిన్న రీతుల్లో చర్చించుకుంటుండడం విశేషం.
సాధారణంగా క్రైం న్యూస్ కథనాల్లో బాధితుల పేర్లను ప్రస్తావిస్తుంటారు. నిందితులతో పోలీసులు కుమ్ముక్కైనట్లు బాధితులు ఆరోపించినట్లు వారి పేర్లు సహా ఉటంకిస్తుంటారు. వెబ్ సైట్ కథనం ప్రచురించిన తర్వాత నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే తమ పత్రిక కథనానికి స్పందనగా ప్రస్తావించుకోవచ్చు. తప్పుడు కథనమని సంబంధిత స్టేషన్ అధికారి, లేదంటే జిల్లా పోలీస్ శాఖ భావిస్తే, ఖండనతో కూడిన పత్రికా ప్రకటన విడుదల చేస్తుంటారు. అప్పుడు ఆయా అధికారుల పేర్లతో ఖండన రాస్తుంటారు. కానీ ఇవేవీ ఆయా కథనాల్లో కనిపించడం లేదనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతుండడమే ఆసక్తికర అంశం. ఔనూ.. ఇంతకీ ఈ అంశంలో ఏం జరిగి ఉంటుందబ్బా..? అని పోలీసు వర్గాల్లో ఒకటే గుస గుస..!