(సమీక్ష ప్రత్యేక కథనం)
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ N Tvపై ఐఏఎస్ ల సంఘం తరపున అత్యున్నతస్థాయి అధికారి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన ఉదంతం మీడియా సర్కిళ్లలోనే కాదు, అధికార, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఓ రాజకీయ నాయకుడితో తమ సంఘానికి చెందిన మహిళా ఐఏఎస్ అధికారికి వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు తప్పుడు వార్తను ప్రసారం చేశారని, తద్వారా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ N Tvపై, T Newsతోపాటు మరో ఎనిమిది యూ ట్యూబ్ ఛానళ్లపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున జయేష్ రంజన్ అనే ఐఏఎస్ అధికారి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నమోదు చేసిన కేసులో N Tv యాజమాన్యం, దాని ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లను ప్రధాన నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అదేవిధంగా T Newsతోపాటు మరో ఎనిమిది యూ ట్యూబ్ ఛానళ్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
అసలు విషయమేమిటంటే.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో నిందితులైన వ్యక్తుల ప్రస్తావన ఎక్కడా లేకపోవడం గమనార్హం. దీంతో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సహజంగా తమకు అందిన ఫిర్యాదులోని సారాంశం ప్రకారమే పోలీసులు ఎఫ్ఐఆర్ ద్వారా కేసు నమోదు చేస్తారు. కానీ ప్రతి ఎఫ్ఐఆర్ లో ఫిర్యాదులో ఫిర్యాదుదారు పేర్కొన్న వ్యక్తులను నిందితులుగా చేరుస్తారు. వాళ్లు దోషులా? కాదా? అనేది కోర్టులో తేలాల్సిన అంశం. ఈ ప్రకారం చూస్తే బహుషా జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఛానళ్ల వ్యవస్థలను, అందులోని హోదాలను ఉటంకించి ఉంటారు. పోలీసు కేసుల్లో సహజంగా కనిపించే సారాంశమిదే.

ఓ ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్తా కథనం ప్రసారం చేసినట్లు తమకు అందిన ఫిర్యాదు ప్రకారం మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు ఇలా వ్యవహరించి ఉండొచ్చు. ఎఫ్ఐఆర్ నెం. 7 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 75, 78, 79, 351(2) సెక్షన్ల కింద ఛానళ్లపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితుల స్థానంలో ఛానళ్లు, హోదాలు తప్ప వ్యక్తుల పేర్ల ప్రస్తావన ఎక్కడా లేకపోవడం గమనార్హం. ప్రధాన నిందితుల కింద N Tv యాజమాన్యం, దాని ఎడిటర్లు, రిపోర్టర్లు, యాంకర్లను మాత్రమే ప్రస్తావించారు.
ఇటువంటి అభియోగపు వార్తా కథనాలకు సంబంధించి సాధారణంగా ప్రింట్ మీడియాలో అయితే ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్, వార్త రాసిన రిపోర్టర్ ను ఫిర్యాదుదారుడు బాధ్యులుగా ప్రస్తావిస్తూ తొలుత ఆయా వ్యక్తులకు లీగల్ నోటీసు జారీ చేస్తారు. దానికి సంబంధిత వార్తా సంస్థకు చెందిన వ్యక్తులు లీగల్ నోటీసుకు జవాబు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫిర్యాదుదారుడు చట్టపరంగా అవసరమైన మార్గాల్లో ముందుకు వెళ్లొచ్చు, వెళ్లకపోవచ్చు. ఫిర్యాదుదారుడు సివిల్, క్రిమినల్ పరంగా పరువు నష్టం కేసు దాఖలు చేస్తే, వార్తా కథనం ప్రచురించినవారు పోరాడవచ్చు, పోరాడకపోవచ్చు.. లేదా సందర్భానుసారం ఆదిలోనే, లేదా కేసు మధ్యలోనూ రాజీ పడవచ్చు. కేసు దాఖలు చేసిన వ్యక్తి రాజీకి ఇష్టపడకుండా పోరాడవచ్చు కూడా. ఇదంతా ఇరుపక్షాల వ్యవహార తీరుపై ఆధారపడి ఉంటుంది. అదంతా వేరే విషయం.
కానీ మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్తా కథనం ప్రసారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదు చేసిన అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారి అందుకు బాధ్యులెవరనే విషయాన్ని తన ఫిర్యాదులో ప్రస్తావించలేదా? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఉద్భవిస్తోంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఎవరి పేర్లూ లేకపోవడమే అందుకు కారణం. వాస్తవానికి టీవీ ఛానల్స్ బాధ్యుల విషయంలో ఒక్కో ఛానల్ ఒక్కో రకంగా వ్యవహరిస్తుంది. కొన్ని ఛానల్స్ ఎడిటర్ హోదాలతో కొందరిని నియమిస్తాయి. మరికొన్ని ఛానళ్ల యాజమాన్యాలు సీఈవోలతో పని కానిచ్చేస్తుంటాయి.

ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ప్రస్తావించిన N Tv విషయానికి వస్తే యాజమాన్యం తరపున దానికో ఛైర్మెన్ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో సీఈవో కూడా ఉన్నారు. ఆ తర్వాత బాధ్యతల్లో తెలంగాణాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ‘ఇన్ పుట్, ఔట్ పుట్’ ఎడిటర్లు ఉన్నారు. ఇన్ పుట్ ఎడిటర్ అంటే ‘రా మెటీరియల్’ తరహాలో వార్తా కథనాలను తెప్పించే బాధ్యతలను నిర్వహిస్తుంటారు. అసైన్మెంట్లు కూడా ఇస్తుంటారు. అంటే ఏ వార్తా కథనానికైనా తొలుత ఇతనే ముఖ్య బాధ్యుడన్నమాట. ఔట్ పుట్ ఎడిటర్ అంటే ‘రా మెటీరియల్’ను అన్నివిధాలుగా సంస్కరించి స్క్రిప్టును రెడీ చేసి వార్తా కథనం ప్రసారానికి అనుమతిని ఇస్తుంటారు. ఈ అంశంలో రిపోర్టర్ల పాత్ర బహిరంగమే. ఔట్ పుట్ నుంచి వచ్చే స్క్రిప్టును స్క్రీన్ పై చదవడమే యాంకర్ల డ్యూటీ. ఇంతటి ప్రక్రియలో ఎవరి బాధ్యతలను వారు నిర్వహిస్తుంటారు.
కానీ ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లూ నిందితులుగా లేకపోవడమే అసలు విశేషం. ఏవో చిన్నా, చితకా యూ ట్యూబ్ ఛానళ్లకు ఇంత భారీ యంత్రాంగంతో కూడిన సిబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్రధాన ముద్దయిగా ప్రస్తావించిన N Tv వంటి ప్రముఖ సంస్థకు ఛైర్మెన్ ఎవరో ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారికి తెలియదా? ఆయన తర్వాత బాధ్యతల్లో గల సీఈవో, ఎడిటర్ గా ప్రాచుర్యంలో గల వ్యక్తులు, ఇన్ పుట్, ఔట్ పుట్ ఎడిటర్ల బాధ్యతల్లో గలవారు ఎవరో తెలిసే అవకాశం లేదా? తెలియకపోతే సమాచారం తెప్పించుకునే యంత్రాంగం లేదా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అదేవిధంగా చాలా న్యూస్ ఛానళ్లలో వార్తా కథనాలు చదివే యాంకర్లు న్యూస్ బులెటిన్ ప్రారంభంలోనే తమ పేర్లు చెబుతుంటారు. N Tvలో కూడా ఈ విధానం ఉన్నట్టుంది.

అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై N Tvతోపాటు T News, మరో ఎనిమిది యూ ట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన వార్తా కథనానికి బాధ్యులుగా చేస్తూ ఎఫ్ఐఆర్ లో ఎవరిపేర్లూ లేకపోవడానికి ఫిర్యాదు తీరే ప్రధాన కారణమనే చర్చ మీడియా సర్కిళ్లలో జరుగుతోంది. ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో పేర్కొనకుండా వార్తా కథనం ప్రసారం చేసిన న్యూస్ ఛానళ్ల ముఖ్యులెవరో, బాధ్యులెవరో పోలీసులకు తెలిసినా, వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసే ఛాన్సే లేదు.
ఈ నేపథ్యంలో కేసుకు సబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, ఫిర్యాదు తీరు కూడా ‘డిప్లొమాటిక్’ వ్యవహారంగానే జర్నలిస్ట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఫక్తు ‘డిప్లొమాటిక్’ ఎఫ్ఐఆర్ గానే పోలీసు వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు సీరియస్ గానే చర్యకు ఉపక్రమిస్తే విచారణ జరిపిన తర్వాత బాధ్యులుగా గుర్తిస్తూ అసలు నిందితులుగా ఎవరిని చేరుస్తారనేది కూడా అత్యంత ఆసక్తికరమే. అటువంటి సీరియస్ చర్యలకు పోలీసులు నడుం బిగించి అడుగు ముందుకేస్తే N Tv వంటి ప్రముఖ ఛానల్ యాజమాన్యం అందుకు బాధ్యులుగా ఎవరిని చేస్తుందనేది కూడా ప్రస్తుతానికి ఓ ప్రశ్నగానే మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.
ఇంతకీ మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్తా కథనాన్ని ప్రసారం చేసి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారనే అభియోగంపై నమోదైన ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ప్రకారం N Tv యాజమాన్యంపై, దాని ఎడిటర్లపై, రిపోర్టలపై, యాంకర్లపై చర్య తీసుకునేందుకు పోలీసులు సాహసిస్తారా? ఇటువంటి అభియోగాలపై మరే ఇతర చిన్నా, చితకా ఛానల్ పై ఫిర్యాదు చేయాల్సి వస్తే..? దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వస్తే పరిస్థితి ఇలాగే ఉండేదా? అనే ప్రశ్నలకు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ లోని ‘డిప్లొమాటిక్’ స్థితి ఏవేని సందేహాలను కలిగిస్తోందా..!

✍️ ఎడమ సమ్మిరెడ్డి
Update:
కాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరుస్తూ వార్తను ప్రసారం చేశారనే అభియోగంపై నమోదైన ఈ కేసులో దర్యాప్తు కోసం ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను నియమించింది. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జన్నార్ నేతృత్వంలో ఏర్పాటైన ‘సిట్’లో సభ్యులుగా నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ డీసీపీ (అడ్మిన్) వెంకటలక్ష్మి, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ ఇన్స్ పెక్టర్ శంకర్ రెడ్డి, ఎస్ఐ హరీష్ లు ఉన్నారు. ఈ కేసుతోపాటు సీఎం రేవంత్ ఫొటోలను అసభ్యకరంగా రూపొందించి వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశాడనే అభియోగంపై నారాయణపేట జిల్లాలో నమోదైన కేసును కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. ఈమేరకు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు.

