ఆధ్యాత్మికవేత్త రచయిత శ్రీరామ్ రచించిన హసిత భాష్పాలు గ్రంథాన్ని శనివారం హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి అందెశ్రీ ప్రచురించారు. తనను చావు బతుకుల్లోంచి బయటకు తీసుకొచ్చిన గురువు శ్రీరామ్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అందెశ్రీ. ఆయన రచించిన పుస్తకం ప్రచురించే అవకాశం తనకు లభించడం అదృష్ట భాగ్యంగా అభివర్ణించుకున్నారు.
అయితే అందెశ్రీ ప్రసంగంలోని కొన్ని బిట్స్ కట్ చేసి అప్పుడే ట్రోల్స్ మొదలుపెట్టారు! అందెశ్రీ తన నూతన ఇంటికి నిన్న స్లాబ్ వేయించారు! గత వారం రోజులుగా వర్షం పడుతున్న నేపథ్యంలో తన గురువు గారైన శ్రీరామ్ తో ఒక్కరోజు వర్షం రాకుండా చూడమని అడిగారట అందెశ్రీ! ఆయన “రాదు, హాయిగా స్లాబ్ పని చూసుకోండి” అని అభయమిచ్చారట! అందెశ్రీ ఆశించినట్లుగానే వర్షం పడలేదు! వాతావరణ శాఖ హెచ్చరికలు, ప్రభుత్వ ఎలర్ట్ లు చేసినా శ్రీరామ్ గారి ఆశీస్సులతో వర్షం ఆపేశారంటూ తన గురు భక్తిని చాటుకుంటూ శ్రీరామ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు అందెశ్రీ.

ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. రేవంత్ రెడ్డిని పొగిడారంటూ ‘భజన చెయ్.. కానీ మరీ చెక్క భజన చేయొద్దు అందెశ్రీ’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి! ఆయన చేసిన పొగడ్తలు కోటి రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నట్లు కొన్ని బిట్స్ కలిపి వీడియోలు కూడా విడుదల చేశారు! నిజానికి ఆయన పొగిడింది శ్రీరామ్ నే!
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది మంది ఉద్యమ ప్రజా కవులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నజరానా, 300 గజాల ఇంటి స్థలం కాగితాలు అందించిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిది మందిలో ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ కూడా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డిని పొగిడారని విమర్శిస్తున్నారు.

నిజానికి శ్రీరామ్ ను ఎంత పొగిడినా తక్కువే! ఆయనలో అంత మహత్తు ఉంది! ఆయనతో రెండు నిముషాలు మాట్లాడిన వారికి, ఆయనతో పరిచయం వున్న వారికి ఆయన ఆధ్యాత్మిక శక్తి గురించి ప్రత్యేకంగా వివరించ నక్కరలేదు! అంతటి మేధాశక్తివంతులు, ఆధ్యాత్మిక భక్తి సుగుణ సంపన్నులు శ్రీరామ్! శ్రీరామ్ ను ఉద్దేశించి ‘వర్షం ఆపగలిగారంటూ’ ఆయన శక్తి గురించి అందెశ్రీ ‘చెప్పవచ్చునో లేదో’ అంటూ సంశయిస్తూనే చెప్పేశారు. ఆ మాటలు పొగడ్తలు ఇప్పుడు వివాదం రేపాయి. నిజానికి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కాదని పూర్తి వీడియో చూసిన వారికి, ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి తెలుసు!
– డా. మహ్మద్ రఫీ