Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

కాంగ్రెస్-టీడీపీ కూటమి వాగ్దానాలపై భట్టి కీలక వ్యాఖ్యలు

మధిర: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమి తరపున ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తామని తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ – తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మధిర ప్రజల రుణం తీర్చుకుంటాం” అని ఆయన పేర్కొన్నారు. మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా, నివసించడానికి అత్యంత అనువైన ‘మోస్ట్ లివబుల్ టౌన్’గా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సోమవారం మధిరలో మున్సిపల్ నూతన పాలకవర్గం ఎన్నిక తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, అత్యంత బాధ్యతగా ఈ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రజలు తమపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని గౌరవిస్తూ, అత్యంత బాధ్యతగా ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. “అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత.. ఈ మూడు సూత్రాలతో మధిర పట్టణ వాసులకు మెరుగైన పాలన అందిస్తామన్నారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు” అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చరిత్రాత్మక విజయమని అన్నారు.

అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం  ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ​గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ, అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్ళి, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు.

Popular Articles