రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని, రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఒక సాధారణ సంక్షేమ పథకంగా చూడవద్దని బ్యాంకర్లను కోరారు. మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి పథకానికి రూపకల్పన చేసినట్టు వివరించారు.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలకు ఏనాడు ఏ ప్రభుత్వం కేటాయింపులు చేయలేదని తెలిపారు. కొలువుల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలపాటు నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థికంగా సామాజికంగా రాష్ట్రంలోని యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు. రాజీవ్ వికాసం ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుందని చెప్పారు.

ఇందిరా గిరి సోలార్ జల వికాసం పథకాన్ని వేగవంతం చేయండి:
ఇందిరా గిరి సోలార్ జల వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదని, ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల ఖరారులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజాభవన్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అడవులను పెంచుతూనే, గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ పథకానికి 12,500 కోట్లు వెచ్చించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వము గిరిజనుల వ్యవసాయ అభివృద్ధికి ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో నిధులు కేటాయించలేదు అన్నారు.
గిరిజనులకు ఆర్ వో ఎఫ్ ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా సోలార్ జల వికాసం ఉపయోగపడుతుందన్నారు. పట్టాలు పొందిన గిరిజనుల భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్ సర్వే, తదుపరి బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు బిగించడం అన్ని పనులు ఒకే ఏజెన్సీకి కేటాయించాలని తద్వారా జాప్యం జరగకుండా, గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా పథకం అమలు సులభతరమవుతుందన్నారు. ఇ0దుకోసం అధికారులు సమావేశమై టెండర్ల ఖరారు కు విధి విధానాలు రూపొందించాలన్నారు.

ఈ పథకం అమలులో ఉద్యాన వన శాఖ పాత్ర కీలకమైందని విషయం తెలిపారు. అవకాడో, వెదురు వంటి పంటలు గిరిజనులు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పంటల సాగు జరుగుతున్న తీరుపై గిరిజన రైతులకు అవగాహన కల్పించేందుకు స్టడీ టూర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పామాయిల్, వెదురు వంటి పంటలు చేతికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది ఈలోపు గిరిజనులకు ఆదాయం సమకూరేందుకు అవసరమైన అంతర పంటల సాగును గుర్తించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మొదట ఈ పథకాన్ని ఆదిలాబాద్, భద్రాద్రి- కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఆయా జిల్లా అధికారులతో సంప్రదింపులు జరపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మే రెండో వారంలోగా పథకం అమలుకు అవసరమైన అన్ని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఒడిశా లో నైనీ గనిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం:
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ నుంచి ఆయన ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.
గత ఏడాది జులైలో తన ఒడిశా పర్యటన సందర్భంగా అంగూల్ ప్రాంత అభివృద్ధికి తాను ఇచ్చిన ప్రతీ హామీని త్వరలోనే సింగరేణి సంస్థ అమలు జరుపుతుందని, ఆ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదని, సామాజిక స్పృహతో ఇక్కడ కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచడం కోసం 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నైనీ కి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన స్థల సేకరణకు ఒడిశా ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు. ఇతర రాష్ట్రంలో తొలిసారిగా బొగ్గు తవ్వకం ప్రారంభించిన సింగరేణి, ఈ గనిని ఆదర్శప్రాయంగా నిర్వహించాలని కోరారు.