Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చివరి ఆయకట్టుకూ సాగు నీరు: డిప్యూటీ సీఎం భట్టి

చిట్ట చివరి ఆయకట్టుకు కూడా సాగు నీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మధిర మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మధిర మండలం సిరిపురం గ్రామంలో 1,240 ఎకరాలకు సాగునీరు అందించే దిశగా వైరా నదిపై 6 కోట్ల 85 లక్షలతో చెక్ డ్యాం నిర్మిస్తున్నామన్నారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయవృద్ధికి దోహద పడతాయని, వేసవి, చలి కాలాల్లో భూగర్భ జలాల కొరత తగ్గిపోతుందని అన్నారు.

చెక్ డాం పైన 3 చిన్న ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, చెక్ డ్యాం నిర్మాణం వల్ల బ్యాక్ వాటర్ 1.5 కిలో మీటర్ల వరకు ఉంటుందన్నారు. చిన్న ఎత్తిపోతల పథకాలకు సంవత్సరం పాటు నీరు అందుబాటులో ఉంటుందని, నదీ గర్భం సమీపంలో గల గ్రామాలలో భూగర్భ జలాలు అధికంగా పెరుగుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఖర్చు చేసినప్పటికీ ఆయకట్టు సృష్టించడంలో వైఫల్యం చెందిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుతో కూడుకున్న పనులు చేపట్టి అధిక ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.

పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం సమాంతరంగా చేపడుతుందన్నారు. గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ కు దీటుగా మన పిల్లలు చదువుకోవాలని యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, మొదటి దశలో నిరుపేదలకు మంజూరు చేస్తామన్నారు.

రైతుల సంక్షేమం దిశగా రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్, రైతు బీమా, ఉచిత విద్యుత్ కు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశామన్నారు. మహిళలను సంపన్నులుగా చేసే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ పనులు చేపట్టామని, ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు, మండలాలలో పెట్రోల్ బంకుల ఏర్పాటు, రైస్ మిల్లులో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి. శ్రీజ, ఇరిగేషన్ ఖమ్మం సిఇ ఓ.వి. రమేష్ బాబు, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్, ఇర్రిగేషన్ కల్లూరు సర్కిల్ ఎస్ఇ జి.వాసంతి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ఇర్రిగేషన్ మధిర డివిజన్ ఇఇ సి.హెచ్. రామకృష్ణ, మధిర డిఇఇ వి. నాగ బ్రహ్మయ్య, సిరిపురం ఏఇఇ బి.శివ సాగర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles