తాము చేసిన పనులు చెప్పుకునేందుకు అవకాశం కల్పించిన క్రెడిట్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లపాటు అధికారంలో గల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకపోయినా, ఎంతో చేసినట్లు ఆ పార్టీ నేతలు భారీ ప్రచారాన్ని చేసుకున్నారని, ఏడాదిలోనే కాంగ్రెసోళ్లు ఎంతో చేసినా చెప్పుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారని భట్టి అన్నారు. తమను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈరోజు ప్రశ్నించడం ద్వారా తాము చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పుకునే అవకాశాన్ని ఆయన కల్పించారని అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రశాంతంగా తమను ప్రశ్నించవచ్చని, తాము సవివరంగా చేసిన ప్రజలకు చేసిన పనులను చెబుతామని భట్టి అన్నారు. శనివారం అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను డిప్యూటీ సీఎం భట్టి సవివరంగా చెప్పారు. అంతేకాదు ప్రత్యేకంగా విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో రుణమాఫీ తదితర పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాలను ఆయన కూలంకషంగా చెప్పారు. గుక్క తిప్పుకోకుండా లెక్కలు సహా భట్టి ఇచ్చిన సమాధానానికి సీఎం రేవంత్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వడం విశేషం.