Top 5 This Week

Related Posts

దారి తప్పి మాట్లాడుతున్నట్టుంది: కేటీఆర్ పై భగ్గుమన్న భట్టి

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులకు మహిళలపట్ల ఏమాత్రం గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రతి సందర్భంలో కేటీఆర్ మహిళల మనసు గాయపరుస్తున్నారని ఆయన అన్నారు. కేటీఆర్ మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని భట్టి సూచించారు. కేటీఆర్ దారి తప్పి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోందని, మహిళల అభివృద్ధి గురించి వారికి శ్రద్ధ ఉంటే వారి క్యాబినెట్లో మహిళలకు అవకాశం కల్పించేవారని అసెంబ్లీలో మాట్లాడుతూ భట్టి పేర్కొన్నారు.

రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ. 25,00 ఆదా అవుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద రూ. 9,000 కోట్లు కేవలం తొమ్మిది రోజుల్లో వారి ఖాతాలో జమ చేశామన్నారు. వడ్డీ లేని రుణాల కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సంవత్సరానికి 20 వేల కోట్ల పైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఇప్పటివరకు వడ్డీ లేని రుణాల కింద రూ. 57 వేల కోట్లను మహిళల ఖాతాలో జమ చేశామని తెలిపారు. మహిళలు బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భట్టి అన్నారు.

ఈ వడ్డీ లేని రుణాల అంశంలో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వడ్డీ లేని రుణాలు చెక్కుల ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు పోతూనే ఉంటామని భట్టి అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలను మహారాణులుగా గౌరవిస్తుందని, వారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఎక్కడ ఆలస్యం అవుతుందోనని ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. ఆడబిడ్డల పక్షాన బస్సు చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా ప్రతినెలా చెల్లిస్తోందని వివరించారు.

అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు? మేకలను ఎక్కడ కట్టివేయాలి? అంటూ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని పదేళ్లపాటు మాటలు చెప్పారని, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మిన ప్రజలు ఎదురు చూసీ, చూసీ కళ్ళు కాయలు కాశాయే తప్ప డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రం రాలేదని భట్టి విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేసి ఇండ్ల నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు.

మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున, మొత్తం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఒకేసారి 22,500 కోట్లు మంజూరు చేశామని, దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా డిప్యూటీ సీఎం వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేసుకుంటూ ముందుకు వెడుతున్నట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, భూమిలేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ హామీల్లో ఏ ఒక్కటి పదేళ్ల కాలంలో నెరవేర్చలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

Popular Articles