ధరణి చట్టం ద్వారా బీఆర్ఎస్ నాయకులు భూ దందాలకు పాల్పడినట్లు తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాల రాసిందని, అసలు రైతును ఆగం చేసిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని, పది ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్ బుక్కులు ఇచ్చారని భట్టి ఆరోపించారు. అయితే ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని తాము బంగాళాఖాతంలో వేశామని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ములుగుమాడులో భూ భారతి సర్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభ సభలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతిగా అభివర్ణించారు. రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. భూ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిందన్నారు. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంలోని పార్ట్ బి లో పెట్టిందని, ఎటువంటి విచారణ చేయలేదన్నారు. తిరిగి ఆయా అసైన్డ్ భూములన్నిటినీ విచారించి అర్హులైన హక్కుదారులందరికీ భూ పట్టాలు ఇచ్చి వారిని భూమిలో కూర్చోబెడతామని చెప్పారు.

భూమిలేని పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆబాది భూమిని సర్వే చేసే అవకాశం కొత్త చట్టం కల్పిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి. ఎవరు భూములు అమ్మారు? ఎవరు కొన్నారు? వంటి అంశాలపై భూ రికార్డుల్లో జరిగిన మార్పులను గ్రామ సభ ద్వారా వివరించే అవకాశాన్ని భూభారతి చట్టం కల్పిస్తుందన్నారు.

భూభారతి చట్టం ప్రజలు సాధించిన విజయం, రైతులు భూమికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కొలిచి అప్పగిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నామంటేములుగుమాడు ఊరంతా కదిలి వచ్చిందని, ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప కీర్తి రాబోతోందని దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. భూభారతి చట్టం మన అందరిదని, అవగాహన చేసుకోవాలని, పది మందికీ వివరించాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు.