హైదరాబాద్: సింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్ల, సిబ్బంది ఖాళీల భర్తీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. సింగరేణి కార్మికుల, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్లో ఉన్న వైద్యుల, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వచ్చే మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు.
సింగరేణిలో ప్రస్తుతం 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారని, 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా 176 పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామకం ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. రామగుండంలో క్యాథ్ లాబ్ నిర్మాణం పిపిపి మోడల్ లో చేపడుతున్నామని, కాంట్రాక్ట్ అవార్డు కూడా పూర్తయిందని, 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సిపిఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులు 8 లక్షల వరకు మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఇండ్ల నిర్మాణం కొరకు స్థల కేటాయింపు అంశాన్ని బోర్డులు మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు.

