హైదరాబాద్: ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు.

ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యాచరణలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 22న సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలో రూ. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.
ఇదే కార్యక్రమంలో స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తొలివిడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని అధికారిక ప్రకటన పేర్కొంది.

కాగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో దామోదర్ రావు తదితరులు ఉన్నారు.

