నేలకొండపల్లి: ప్రజా ప్రభుత్వం ప్రతి పైసా రాష్ట్రంలోని ప్రజల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నదని తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. అనంతనగర్ లో ఏర్పాటు చేసిన 33/11 కె వి సబ్ స్టేషన్ ను ప్రారంభించి, కామాంచికల్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు రాకుండా, వ్యవసాయ అవసరాలు, ప్రజల గృహ అవసరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలని స్థానిక ప్రజా ప్రతినిధి, మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే మంజూరు చేసి అతి తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

గత పాలకులు రాష్ట్ర ప్రజలపై రూ. 8 లక్షల కోట్ల భారీ అప్పుల భారం మోపినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేయలేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ప్రతి సంవత్సరం 12 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. రూ. 13 వేల 500 కోట్లు ఖర్చు చేస్తూ 96 లక్షల పేద కుటుంబాలకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. కోటీ మంది మహిళలకు ఇంటింటికి వెళ్లి ఇందిరమ్మ చీరలను ప్రజా ప్రభుత్వం పంపిణీ చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు.
గత పాలకులు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు మీద ప్రజలను మోసం చేస్తే ప్రజా ప్రభుత్వంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నానరు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం 22 వేల 500 కోట్ల రూపాయలను కేటాయించిందని, ప్రతి వారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులు పండించిన సన్న వడ్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా మద్దతు ధరతో పాటు 500 రూపాయలు క్వింటాల్ కు బోనస్ చెల్లిస్తున్నామన్నారు. మహిళల తరఫున ఆర్టీసీ సంస్థకు 8 వేల 600 కోట్లు ఖర్చు చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజలకే ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం కోరారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 2 కోట్ల 25 లక్షల రూపాయలతో అనంత నగర్ లో నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, కోటి 75 లక్షల రూపాయలతో కామంచికల్ లో నిర్మించ నున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన ఒకేరోజు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత పాలకులు ధనిక రాష్ట్రం తెలంగాణను స్వలాభం కోసం దోచుకుని ప్రజా ప్రభుత్వంపై రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని మంత్రి విమర్శించారు. పేద ప్రజల ముఖాలలో ఆనందం చూడాలని లక్ష్యంతో ఎన్ని కష్టాలు ఉన్న ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
పేదలకు సంక్షేమం అమలు చేస్తూనే రోడ్లు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు వంటి మౌళిక వసతుల కల్పన అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. గత పాలకులు చేసిన మంచి పనులను కొనసాగిస్తూ వాటికి అదనంగా సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గురుకులాల్లో పిల్లలకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్స్ చార్జిల పెంపు చేశామని చెప్పారు. రాబోయే ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లు తప్పనిసరిగా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్.పీ.డి.సి.ఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

