ఖమ్మం జిల్లాలో డెంగీ హాట్ స్పాట్లను అధికారగణం గుర్తించింది. జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగీ జ్వరం బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల 24వ తేదీన జిల్లాలోని తల్లాడకు చెందిన యోగా టీచర్ కందుల శ్రీదేవి డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై తల్లాడ మండల మెడికల్ ఆఫీసర్ ఐ. రత్నకుమార్ ను బుధవారం సస్పెండ్ చేశారు. ఈ ఘటన తర్వాత జిల్లాలో డెంగీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కూసుమంచికి చెందిన పందిరి రెడ్డి (24) డెంగీబారిన పడి మృతి చెందాడు.

ఈ నేపథ్యంలోనే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ గడచిన నాలుగేళ్లలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 82 ప్రాంతాలను డెంగీ ‘హాట్ స్పాట్’లుగా గుర్తించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏటా 500కు పైగా డెంగీ కేసులు నమోదవుతుండగా, 200 కేసులకు పైగా హాట్ స్పాట్లుగా గుర్తించిన గ్రామాల్లోనే నమోదవుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. మొత్తం 82 డెంగీ హాట్ స్పాట్లలో అత్యంత తీవ్రత గల గ్రామాల వివరాలు మండలాలవారీగా ఇలా ఉన్నాయి.
- జల్లేపల్లి, పాతర్లపాడు, అజ్మీరాతండా, తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం (తిరుమలాయపాలెం మండలం)
- పెద్దమునగాల, పల్లిపాడు, గోపవరం, (కొణిజర్ల)
- నేలకొండపల్లి, రాయగూడెం, బోదులబండ, గువ్వలగూడెం (నేలకొండపల్లి)
- గుర్రాలపాడు, గుదిమళ్ల, రామన్నపేట (ఖమ్మం రూరల్)
- వైరా మండల కేంద్రం
- తూటికుంట్ల (బోనకల్)
- బాణాపురం, వల్లభి (ముదిగొండ)
- వీవీ పాలెం (రఘునాథపాలెం)
- బాలప్పేట (ఖమ్మం అర్బన్)
- కందుకూరు (వేంసూరు)
- గంగారం (సత్తుపల్లి)
- అన్నారుగూడెం (తల్లాడ)
- కల్లూరు మండల కేంద్రం
