(By Mohammed Rafee)
ఆ తల్లి పేరు అంజలి.. గాయని
చాకలి ఐలమ్మ ముని మనవరాలు
ఆమె గాయని, డప్పు కళాకారిణి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేత సట్ల అంజలి. వయసు 39 సంవత్సరాలు. తెలంగాణ రైతాంగ ఉద్యమ నేత చాకలి ఐలమ్మ ముని మనవరాలినని ఆమె చెప్పుకునే వారు. కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పడంతో ఆమెను ప్రియుడితో కలసి కూతురే దారుణంగా చంపేసింది. హృదయ విదారకర ఈ దుర్ఘటన హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది.
చిన్న వయసులోనే ప్రేమలో మునిగిన కుమార్తెను తల్లి మందలించడమే ఈ హత్య కారణం. తన ప్రియుడితో కలసి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి, తలపై ఇనుప రాడ్ తో కొట్టి తల్లి అంజలిని హత్య చేసేసింది. పదోతరగతి చదువుతున్న ఆ “గొప్ప” కూతురు ఇంకా ‘మైనర్’. నిబంధనల ప్రకారం నిందితురాలి పేరు రాయకూడదు. ఆ “మహా” ప్రేమికుడి పేరు మాత్రం పగిల్ల శివ. అతని సోదరుడు యశ్వంత్ కూడా ఈ హత్యలో సహకరించినట్లు జీడిమెట్ల పోలీసులు చెబుతున్నారు.

బాలిక వయసు జస్ట్ పదహారేళ్లు. పదో తరగతిలోనే శివ ప్రేమలో పడిపోయింది. వాడి వయసు 18 ఏళ్లు. పరిచయం.. ప్రేమ తిప్పి తిప్పి కొడితే ఎనిమిది నెలలే. పదహారేళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన తల్లినే లేపేసింది క్రూరమైన ప్రేమ.
అంజలి కుమార్తెను వారించింది! “చిన్న వయసు.. తెలియని వయసు.. ప్రేమా గీమా వద్దు” అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ బాలిక తన తల్లి మాట వినలేదు. వారం క్రితం శివతో కలసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. శివ నల్గొండలో ఉంటాడు. తిరిగి మూడు రోజుల క్రితమే జీడిమెట్లలో ఉంటున్న తల్లి ఇంటికి వచ్చింది బాలిక. స్కెచ్ వేసుకునే వచ్చినట్లుంది. “పదవ తరగతిలో ప్రేమ ఏంటని, బుద్దిగా డిగ్రీ అయ్యాక అదే ప్రేమ ఉంటే అతడినే చేసుకో” అని ఎన్నో విధాలుగా నచ్చచెప్పినా ఆ అమ్మాయి చెవికి ఎక్కలేదట! మూడు రోజులుగా తీవ్ర గొడవలు.. అని ఎదురింటి వాళ్ళు చెబుతున్నారు.

తల్లి అంజలిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం నల్గొండ నుంచి శివ వచ్చాడట! పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…అంజలి పూజ చేసుకుంటుండగా, వెనుక నుంచి బెడ్ షీట్ తో శివ ఆమె ముఖాన్ని కప్పేసి గొంతు పట్టుకుని ఊపిరి ఆడకుండా చేస్తున్న క్రమంలో కుమార్తె రాడ్ తీసుకుని తలపై బలంగా కొట్టిందట. శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో ఆమె పీక కోసేశాడట! ఎంత దుర్మార్గం? ఎంత అమానుషం?
ప్రియుడి కోసం భర్తలను చంపేస్తున్న ఘటనలతో ఇప్పటికే యువకులు బెంబేలు ఎత్తిపోతున్న తరుణంలో ప్రియుడి కోసం కన్నతల్లినే కర్కశంగా చంపేయడం ఎంతటి అమానుషం? సమాజం ఎటు పోతోంది? అమ్మాయిలు ఎందుకిలా తయారవుతున్నారు? అబ్బాయిలు ఏం మత్తు పెట్టి అమ్మాయిలను ఇంత కసాయిలుగా మార్చేస్తున్నారు?
(ఫోటోలో తల్లి అంజలిని చూడొచ్చు. ఈమె నిజానికి చాకలి ఐలమ్మ మనవరాలు కాదు. ఫేమ్ కోసం, అవకాశాల కోసం చాలా కాలంగా అలా చెప్పుకుంటూ వచ్చింది. నిజమైన వారసుడు చిట్యాల రామచంద్రం చాలా సార్లు ఖండించారు. కానీ ఈమె మాత్రం ఏం తగ్గలేదు. ఐలమ్మ మనవరాలినే అంటూ వాదిస్తూ వచ్చింది. అందుకే అంజలి చెప్పుకున్నట్లుగా నేను ఐలమ్మ మనవరాలు అని రాశాను. వాస్తవం ఏమిటో ఎన్నేళ్లు అయినా బయటకు రాలేదు. చివరకు ఆమె లేకుండా పోయారు)