Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘లవర్’తో కలిసి తల్లిని చంపిన కూతురు!

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జన్మనిచ్చిన తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ కసాయి కూతురు. తన ప్రేమకు అడ్డు వచ్చిందనే కారణంతోనే ఆ బాలిక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రియునితోపాటు అతని తమ్ముడు, బాలిక కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ దారుణ ఘటనపై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జీడిమెట్ల పరిధిలోని హెచ్ఎల్ కాలనీలో హత్య జరిగిందనే సమాచారం అందిందని, పోలీసులు వెళ్ళే సరికి రక్తపు మడుగులో ఒక మహిళ పడి ఉందని చెప్పారు. హత్యకు గల కారణాలపై తమ టీమ్స్ దర్యాప్తు చేశాయని, మృతురాలు అంజలి వారం రోజుల క్రితం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇచ్చిందని, తన కూతురు కనపడటం లేదని ఆమె ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ పరిణామాల్లోనే మూడు రోజుల క్రితం అంజలి కూతురు ఇంటికి తిరిగి వచ్చిందన్నారు.

నల్గొండ జిల్లా కట్టమూరుకి చెందిన శివతో బాలిక ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాలికకు శివ పరిచయమయ్యాడని, ఇందులో భాగంగానే బాలిక శివతో వెళ్ళిపోయిందన్నారు. వెళ్లేముందు ఇంట్లో ఉన్న రూ. 2.00 లక్షల నగదును కూడా తీసుకెళ్లిందని, తిరిగి వచ్చిన తర్వాత తల్లి హత్య కు ప్లాన్ చేసిందని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం బాలిక శివను నల్గొండ నుంచి నిన్న సాయంత్రం పిలిపించిందని, అంజలి మెడకు చున్నీ బిగించి హత్య చేశారని చెప్పారు. సుత్తితో అంజలి తలపై దాడి చేశారని, శివ వెంట అతని తమ్ముడు యశ్వంత్ కూడా వచ్చాడన్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నాని డీసీపీ సురేష్ కుమార్ వివరించారు.

కాగా ట్యూషన్ నుంచి వస్తుండగా తనను అక్క గల్లీలోనే ఆపిందని హత్యకు గురైన అంజలి చిన్న కూతురు ప్రియ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దాం అని తనను తీసుకెళ్లిందని, 20 నిమిషాల తర్వాత తాను, అక్క ఇంటికి చేరుకున్నామని చెప్పింది. ‘అప్పటికే కిచెన్ లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను నేను చూసుకుంటా, నువ్వు బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకుని రా.. గల్లీలో ఆంటీ వాళ్లకు ఎవరికీ చెప్పకు’ అని చెప్పిందని ప్రియ పేర్కొంది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకున్న అక్క మళ్ళీ శివకి కాల్ చేసిందని, అమ్మ ఇంకా చనిపోలేదు.. కాళ్లు చేతులు ఆడిస్తోందని చెప్పిందని, మళ్ళీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టారని ప్రియ ఏడుస్తూ చెప్పింది. అమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళిపోయారని, తాను అప్పుడే వచ్చానని, చూసేసరికి అమ్మ రక్తపుమడుగులో పడి ఉందని, వెళ్ళి చేతులు రుద్ది లేపే ప్రయత్నం చేశానని, కానీ అక్క మాత్రం దగ్గరికి కూడా రాలేదని, అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అన్నదని ప్రియ మీడియాకు తెలిపింది.

Popular Articles